ఒక హిట్ కొట్టగానే దర్శకుడికి డిమాండ్ పెరుగుతుంది. “ఈ డైరెక్టర్ తోనే సినిమా చెయ్యాలి” అంటూ నిర్మాతలు క్యూ కడతారు. ఈ ఉత్సాహంలో చాలామంది దర్శకులకు ఒకేసారి పలు నిర్మాతల నుంచి అడ్వాన్సులు తీసుకుంటారు. కానీ తర్వాతే కథలో అసలు ట్విస్ట్ వస్తుంది. డబ్బు వస్తే బాధ్యత, ఒత్తిడి కూడా మొదలైపోతాయి. కానీ కొందరు దర్శకులు ఆ విషయాన్ని మర్చిపోతారు. ఒక హిట్ తర్వాత వచ్చే ఫేమ్, ఆఫర్లు ఇవన్నీ కలిపి క్రియేటివిటీ పై మబ్బు కమ్మేస్తాయి.
దర్శకులు, నటులకు తేడా వుంది. ఒక నటుడు ఓపిక వుంటే ఒకేసారి నాలుగు సినిమాలు చేయొచ్చు. కానీ దర్శకుడుకి అలా కుదరదు. తన ఫోకస్ ఒక సమయంలో ఒక ప్రాజెక్ట్ పైనే వుండాలి. దీంతో మిగతా ప్రాజెక్ట్స్ “తర్వాత చూద్దాం” అని వదిలేస్తారు. ఇక్కడే అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతకు నిరాశ, నమ్మకానికి దెబ్బ.
ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు ఈ దశను చూశారు. ఒక హిట్ ఇచ్చి మూడు బ్యానర్ల నుంచి అడ్వాన్స్ తీసుకున్న దర్శకుడు, ఏదో ఒక సినిమా మాత్రమే చెయ్యగలిగాడు. మిగతా నిర్మాతలు రెండు మూడు సంవత్సరాలు ఎదురు చూసి చివరికి ఎదురుతిరిగారు.
కొందరు మాత్రం ఈ వలలో పడకుండా జాగ్రత్తపడ్డారు. త్రివిక్రమ్, సుకుమార్, రాజమౌళి లాంటి దర్శకులు ఈ ట్రాప్ లోకి రాలేదు. కెరీర్ బిగినింగ్ లో అవసరాలు కోసం కొన్ని అడ్వాన్స్ తీసుకున్నా పూర్తిగా మునిగిపోయే స్టేజ్ కి వెళ్ళలేదు. ఒక స్థాయి వచ్చాకా డబ్బు కంటే క్రియేటివ్ ఫ్రీడమ్ కి పెద్దపీట వేశారు. ఇందులో త్రివిక్రమ్ అయితే నిర్మాతని కూడా మార్చలేదు. చేస్తే నిర్మాత చినబాబుతో చేస్తారు లేదంటే నచ్చింది చదువుకొని రాసుకొని హాయిగా వుంటారు. సుకుమార్ ప్రస్తుతం మైత్రీతోనే ప్రయాణం చేస్తున్నారు. రాజమౌళి అయితే ఈ విషయంలో మరీ పట్టుదలతో ఉంటారు. ఆయన స్థాయికి ఆయన చేతిలో ఎన్ని అడ్వాన్సులు ఉండాలి? కానీ… నిర్మాత దగ్గర అడ్వాన్స్ తీసుకోవడం అనేది ఆయనకు తెలీదు. ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం తీసుకొన్న అడ్వాన్స్ కు న్యాయం చేయాలనే మహేష్ బాబు సినిమాలో కె.ఎల్.నారాయణని భాగస్వామిగా తీసుకొన్నారు. ఈ విషయంలో యువ దర్శకుడు సాయి మార్తాండ్ ని మెచ్చుకొని తీరాలి. లిటిల్ హార్ట్స్ తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు ఈయన. 2.5 కోట్లతో పాతిక కోట్లు రాబట్టాడు. లిటిల్ హార్ట్స్ తరవాత చాలామంది నిర్మాతలు అడ్వాన్సులు ఇవ్వడానికి పోటీ పడ్డారు. కానీ.. తనకు తొలి అడ్వాన్స్ ఇచ్చిన జగపతిబాబుకే కట్టుబడ్డాడు.
అయితే ఈ అడ్వాన్స్ ట్రాప్ లో పడిపోయే దర్శకులే ఎక్కువ. ఒక్క హిట్టు పడగానే అప్పటిఅవసరాలు తీర్చుకోవడం కోసం ముందు వెనుక చూడకుండా అడ్వాన్స్ లు పట్టేస్తారు, ఇక్కడే డబ్బు క్రియేటివిటీ డామినేట్ చేస్తుంది. అద్భుతంగా తీయాలనే ఆలోచనకు బదులు ఎదోరకంగా చూట్టేసి చేతులు దులుపుకోవాలనే వైఖరిలోకి జారుకుంటారు. అదీ సాధ్యం కాకపోతే షో రన్నర్ గా తన పేరు వేసుకొని జనాల మీదకి వదులుతారు. నమకాన్ని కోల్పోవడం తప్పితే వాస్తవానికి ఏవేమి వర్క్ అవుట్ కావు.
డబ్బు అనేది అందరికీ అవసరం. క్రియేటివిటికి అదే ఇంధనం. అయితే ఆ క్రియేటిటీ డబ్బు కారణంగా మసక బారకూడదు. సినిమా అనేది కేవలం బిజినెస్ కాదు, ఇది ఎమోషన్, నమ్మకం మీద నడిచే కళ. మితిమీరిన అడ్వాన్స్ ఒత్తిడి పెంచి సృజనాత్మకతను చంపేస్తుంది. ఫిలిం మేకర్ పతనానికి కారణం అవుతుంది. ఒక హిట్ ఫేమ్ తెస్తుందేమో, కానీ తర్వాత నమ్మకం మాత్రమే లాంగ్ రన్ కెరీర్ ఇస్తుంది. ఈ సత్యం గ్రహించి ముందుకు వెళితేనే ఇక్కడ మనుగడ, మన్నిక.
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              