ఈరోజుల్లో మాస్ హీరోలు, స్టార్ హీరోల సినిమాలకే ఓటీటీలు అమ్ముడుపోవడం లేదు. అలాంటిది ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగానే, ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకొందంటే అది మామూలు విషయం కాదు.
రష్మిక ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘ద గాళ్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడైపోయాయి. నెట్ ఫ్లిక్స్ రూ.14 కోట్లకు ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని కొనుగోలు చేసింది. హిందీ డబ్బింగ్, శాటిలైట్ రూపంలో మరో 7 కోట్లు వచ్చాయి. అంటే… మొత్తంగా రూ.21 కోట్లన్నమాట.
రాహుల్ రవీంద్రన్ తొలి సినిమా చి.ల.సౌ మంచి సినిమానే. కాకపోతే వసూళ్లు మరీ అంత గొప్పగా రాలేదు. రెండో సినిమా మన్మథుడు 2 బిగ్గెస్ట్ ఫ్లాప్. ఇది మూడో సినిమా. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఇంత మంచి మొత్తం వచ్చిందంటే అది కచ్చితంగా రష్మికకు ఉన్న క్రేజే. పుష్ప, యానిమల్ సినిమాలతో బాలీవుడ్ లోనూ గుర్తింపు తెచ్చుకొంది రష్మిక. తెలుగులో కంటే అక్కడే ఎక్కువ సినిమాలు చేస్తోంది. తాను నటించిన సినిమాలు వరుసగా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరుతున్నాయి. సోషల్ మీడియాలోనూ రష్మికకు దుమ్ము రేగే ఫాలోయింగ్ ఉంది. ఇవన్నీ ఓటీటీలను ఆకర్షిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాకు టికెట్ తెగిందంటే అది కచ్చితంగా రష్మికకు ఉన్న క్రేజ్ తోనే. నవంబరు 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఆరోజున థియేటర్లు ఎంతగా నిండుతాయి? అనేది ప్రశ్న. రష్మికకు ఉన్న ఫాలోయింగ్ ఈ సినిమాకు ఓపెనింగ్స్ తీసుకొస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు. ఓపెనింగ్స్ కూడా రాబట్టగలిగితే.. రష్మికతో సోలో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎగబడడం ఖాయం.
