అబ్బాయిలా ఆ ఆటలేంటి? – సగటు భారతీయ కుటుంబాల్లో వినిపించే కామన్ డైలాగ్ ఇది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ డైలాగ్ కి పేటెంట్ రైట్స్ చాలా వరకూ అమ్మలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు.. ఇలా అమ్మరూపంలో వున్న స్త్రీలే తీసుకుంటారు. లింగ భేదాలు తెలియని ఓ చిన్నారి తూనీగలా జివ్వున ఎగురుతుంటే..’అమ్మాయివి ఈ దూకుడెందుకు?’ అంటూ ఓ దుర్మార్గమైన డైలాగ్ కొడతారు. అలా విన్న డైలాగ్ పాపం.. ఆ పసిపాప మనసులో ఓ గాయంలా నాటుకుపోతుంది. అమ్మాయిలు ఇలా పరిగెత్తకూడదేమో, అలా గెంతులు వేయకూడదేమో? అనే ఆత్మనూన్యత భావం ఆవహిస్తుంది. అక్కడి నుంచి చిన్నారిలో ఏదో అర్ధం కాని నెమ్మది వచ్చేస్తుంది. నడకలో మార్పులు వచ్చేస్తాయి. అలా రాకపోయినా ‘అబ్బాయిలా ఆ నడకేంటీ?’ అనే ఇంకో ముతక డైలాగ్ తో బలవంతంగా అమ్మాయిలకు నడక నేర్పిస్తారు.
ఇలాంటి మైండ్ సెట్ తో వున్న అమ్మలు అమ్మమ్మలు నాన్నలు నాన్నమ్మలందరికీ.. దక్షిణాఫ్రికా బ్యాటర్ డిక్లెర్క్ గాల్లోకి కొట్టిన బంతిని.. హర్మన్ ప్రీత్ కౌర్ తూనీగలా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టి రాకెట్ లా దూసుకొచ్చి విశ్వ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న వీడియో చూపించండి. ఎందుకంటే ఇది మైండ్ సెట్ మార్చేయగల గెలుపు.
ఈ దేశంలో క్రికెట్ ఒక మతం. ఈ కల్ట్ ఫాలోయింగ్ ఒక్కరోజులో సాధ్యం కాలేదు. కపిల్ దేవ్ వరల్డ్ కప్ లిఫ్ట్ చేసేవరకూ ఇలాంటి కల ఎవరూ కనలేదు. ఆ విజయం సచిన్, సౌరభ్, ధోని, విరాట్, రోహిత్ లాంటి కొత్త హీరోలు పుట్టుకొచ్చేలా చేసింది. విశ్వవేదికపై భారత క్రికెట్ రూపురేఖలు మార్చింది. ఇప్పుడు మన అమ్మాయిలు విశ్వ విజేతలుగా నిలిచారు. ఇది కేవలం ఓ వరల్డ్ కప్ విజయం మాత్రమే కాదు.. ఓ ఉజ్వల స్వపానికి తెరచుకున్న తలుపు. క్రికెట్ అబ్బాయిలదే కాదు అమ్మాయిల ఆటని చెప్పిన గెలుపు.
ఒక వరల్డ్ కప్ గెలుపుతో ఏమైపోతుందని తేలికగా తీసుకోవద్దు. ఈ దేశంలో క్రికెట్ కి వున్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విజయం క్రీడల్లోనే కాదు సామాజిక పరిస్థితుల్లో కూడా గణనీయమైన మార్పులు తీసుకొచ్చే ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చింది.
పురుషాధిక్యానికి రాజపోషకులు స్త్రీలే. ఈమాట కటువుగా వుంటుంది కానీ నిజం. ఓ ఇంట్లో ఆడపిల్ల పుడితే అదేదో అశుభం జరిగినట్లు అత్తగారి ఎక్స్ ప్రెషన్స్ బ్రతికుండగానే ఆ ఇల్లాలిని కాల్చేస్తాయి. అది అక్కడితో ఆగిపోదు. ఆ అమ్మాయికి ప్రతి దశలో చిన్నచూపు వెంటాడుతూ వుంటుంది.
ఇలాంటి మైండ్ సెట్ వున్న మహిళామూర్తులందరికీ ఈ రోజు పేపర్లు, టీవీల్లో వచ్చే వార్తలు చూపించాలి. నిన్న ఇండియా పురుషుల టీం ఆస్ట్రేలియాతో ఒక మ్యాచ్ గెలిచింది. భారత మహిళలు వరల్డ్ కప్ టైటిల్ కొట్టారు. పురుషల విజయాన్ని ఒక కార్నర్ కి పరిమితం చేసిన నాలుగు లైన్లు రాశారు. ఫుల్ పేజీ అంతా అమ్మాయిలదే. ఇక్కడ అబ్బాయిలా? అమ్మాయిలా? అని కాదు.. గెలుపు ముఖ్యం. మన గెలుపు ఎంత ఘనంగా ఉంటుందో… ప్రపంచం అంత గర్విస్తుంది.
క్రికెట్ ని మతంలా భావించే ఈ దేశంలో ఈ ప్రపంచ కప్ విజయాన్ని అస్సలు తేలికగా తీసుకోవద్దు. సమానత్వం సాధించడానికి ఇదొక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని ముందుకు తీసుకెళ్లడం స్త్రీల చేతుల్లోనే ఎక్కువ వుంది.
అమ్మాయిలు క్రికెట్ ఆడతానంటే పోత్సహించండి. ఖరీదైన బట్టలు నగలు కొనే బదులు బ్యాటులు, క్రికెట్ కిట్లు కొనివ్వండి. అమ్మయిల క్రికెట్ ఎవరూ చూస్తారనే ప్రశ్న నుంచి నిన్న ఫైనల్ మ్యాచ్ కి టికెట్లు దొరకని పరిస్థతి వచ్చింది. స్టేడియం కిక్కిరేసి పోయింది. స్పాన్సర్లు లేని స్థితి నుంచి వాళ్ళే ఎగబడే పరిస్థితి వచ్చింది. ఈ మూమెంట్ ని ముందుకు సాగించే బాధ్యత పురుషల కంటే స్త్రీలకే ఎక్కువ వుంది.
నిజానికి విమెన్ క్రికెట్ ని ప్రోత్సహించడంలో ఇప్పటివరకూ అగ్రభాగం పురుషులదే. అబ్బాయిలు క్రికెట్ మీద ఆసక్తితో అమ్మాయిలు ఆడే మ్యాచులు టీవీలో చూస్తున్నప్పుడు ‘అమ్మాయిల ఆట కూడా చూస్తారా?’ అని తేలికగా మాట్లాడే స్త్రీలు వున్నారు. ఇకపై ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి.
భర్త, అత్తమామలని ఎందులో విషం పెట్టి చంపాలని చూస్తున్న భార్య, భార్యని ఏ రాడ్డుతో కొట్టి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేస్తున్న భర్త.. ఇలాంటి మహోత్కృష్టమైన సీరియల్స్ కు రాజపోషకాలు అవ్వడం కంటే.. అమ్మాయిల ఆడుతున్నప్పుడు ఆ మ్యాచ్ కి ట్యూన్ అవ్వండి. ఆటోమేటిక్ గా టీఆర్పీలు వస్తాయి. స్పాన్సర్స్ పెరుగుతారు. క్రేజ్ కి డోకా వుండదు.
అబ్బాయిలకే క్రికెట్.. మాకెందుకనే నిరాశ వద్దు. ఈ విజయం మీ ఇంట్లో వున్న ఓ పాపకి స్పూర్తినిచ్చి వుండవొచ్చు. తనకి వంటగదిలో గరిట కంటే మైదానంలో బ్యాట్ తిప్పాలనే ఆశ కలిగుండవచ్చు. తన కోసం క్రికెట్ చూడటం మొదలుపెట్టండి. స్మృతి మందాన, హర్మన్‌ప్రీత్ కౌర్, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్.. వీళ్ళు ఆడే విధానం అబ్బాయిలకంటే ఎందులోనూ తక్కువ కాదు. స్మృతి మందాన లాగిపెట్టి సిక్స్ కొడుతుంటే చూడటానికి చాలా ముచ్చటగా వుంటుంది. హర్మన్‌ప్రీత్ స్టాన్స్ రోహిత్ శర్మలా వుంటుంది. తను ఫ్లిక్ షాట్ విరాట్ కంటే బెటర్ గా ఆడుతుంది. షఫాలీ వర్మ సెహ్వాగ్ లా బాదేస్తుంది. జెమిమా మరో రాహుల్ ద్రావిడ్. దీప్తి శర్మ, రిచా ఘోష్ పిచ్చ కొట్టుడు కొడతారు. ఇందులో ఎవరూ క్లిక్ అయిన మ్యాచ్ పైసా వసూల్.
ఇలాంటి విశ్వ విజయం తర్వాత కూడా క్రికెట్ అబ్బాయిలేదే అనే సంకుచితమైన ఆలోచనలు వుంటే.. ఒక్కసారి గ్రౌండ్ లో జరుగుతున్న ఒక ప్రాక్టీస్ సెషన్ చూడడానికి వెళ్ళండి. బౌలింగ్ మిషన్ నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వస్తున్న బంతిని లాగిపెట్టి కొడుతున్న బ్యాటర్ ని గమనించండి. హెల్మెట్ తీసే వరకూ అమ్మాయా? అబ్బాయా? అనే సంగతి గ్రహించలేరు.
-శ్రీనివాస్ రౌళో
