హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ భారీ భూమి వేలం ప్రక్రియను ప్రారంభిస్తోంది. మొత్తం 43.64 ఎకరాల ప్రభుత్వ భూములను కొకపేట్లోని నియోపొలిస్ లేఅవుట్, గోల్డెన్ మైల్ లేఅవుట్, మేడ్చల్ జిల్లాలోని మూసాపేట్ వై జంక్షన్ వద్ద ఉన్న స్థలాలను వేలం చేయనున్నారు. ఈ వేలం నవంబర్ 24న ప్రారంభమై, డిసెంబర్ 5 వరకు కొనసాగుతుంది. ప్రీ-బిడ్ సమావేశం నవంబర్ 17న టి-హబ్ లో ఏర్పాటు చేశారు.
ఈ వేలం ద్వారా రూ.5,000 కోట్లకు పైగా ఆదాయం సమకూర్చుకోవచ్చని అంచనా వేస్తున్నారు. గ్లోబల్ కంపెనీలు, పెద్ద డెవలపర్లను ఆకర్షించే లక్ష్యంతో ఈ భూములు వేలంవేస్తున్నారు. నియోపొలిస్, కొకాపేట్లో 27 ఎకరాలు వేలం వేస్తున్నారు. ఎకరం రూ. 99 కోట్లు కనీస ధరగా నిర్ణయించారు. కోకాపేట గోల్డెన్ మైల్ లే ఔట్ లో 1.98 ఎకరాలను రూ. 70 కోట్లు .. ఎకరం కనీస ధరగా నిర్ణయించారు. మూసాపేట్ వై జంక్షన్ వద్ద ఉన్న 14.66 ఎకరాల్లో ఎకరానికి రూ. 75 కోట్లు కనీస ధరగా నిర్ణయించారు.
నియోపొలిస్ లేఅవుట్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) నుంచి కేవలం 2 కి.మీ. దూరంలో ఉంది. రాయదుర్గం ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉండటంతో ప్రపంచ స్థాయి కంపెనీలకు ఆకర్షణీయం. ఎయిర్‌పోర్ట్‌కు 20 నిమిషాల దూరంలో ఉంటుంది. హెచ్ఎమ్డీఏ ఇక్కడ 40 ఎకరాలపై రూ.300 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు పూర్తి చేసింది. 45 మీటర్ల వెడల్పు రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, విద్యుత్ సరఫరా, సైక్లింగ్ ట్రాక్‌లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
గోల్డెన్ మైల్ కూడా కొకపేట్లోనే ఉండటంతో ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. మూసాపేట్ వై జంక్షన్ మేడ్చల్ జిల్లాలో ఉండటంతో ఇండస్ట్రియల్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు అనువైనది. ఈ భూముల వేలం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ పెంచుకునే అవకాశం ఉంది. నవంబర్ 24, 28; డిసెంబర్ 3, 5 తేదీల్లో వేలం వేస్తారు. ఇటీవల రాయదుర్గంలో ఎకరాకు 177 కోట్లు రావడంతో.. ప్రభుత్వం ఆ స్థాయి స్పందన కోరుకుంటోంది.
