రచ్చగెలిచి ఇంట గెలిచాడు నవీన్ పొలిశెట్టి. బాలీవుడ్లో తన ప్రతిభను నిరూపించుకున్న తర్వాత తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తెలుగు తెరపైకి రాకముందే హిందీ ఎంటర్టైన్మెంట్ రంగంలోనే తన పేరు వినిపించింది. నటుడిగా, రచయితగా, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా, రియాలిటీ షోల్లో తన టాలెంట్‌ను చూపించాడు. సింగర్ ఉదిత్ నారాయణ వాయిస్‌ని మిమిక్రీలో అద్భుతంగా దించేస్తాడు. ఇప్పుడు తానే స్వయంగా పాటగాడిగా మారాడు.
ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నవీన్. మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో హీరోయిన్. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి నవీన్ స్వయంగా పాడిన పాటను రాబోయే నెలలో విడుదల చేయనున్నారు. మిక్కీ జె. మేయర్ ఇప్పటికే ఈ పాటను రికార్డ్ చేశారు.
సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే ఏదో ప్రత్యేకత ఉండాలి. ఇప్పటికే సినిమాను యూనిక్‌గా ప్రమోట్ చేసే బాధ్యతను నవీన్ స్వయంగా తీసుకున్నాడు. కొన్ని ప్రమోషనల్ వీడియోలు, ప్రోమోలు చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు నవీన్ పాడిన పాట కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేయబోతోంది. తన సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో ఈ స్థాయిలో ఆరాటపడుతున్న నవీన్ ప్రయత్నాలని అభినందించాల్సిందే.
