జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి తమ ప్రచారం సూపర్ అని తమకే అనిపిస్తోంది. తమ ప్రచారానికి అందరూ ఫ్లాట్ అయిపోతున్నారని .. తమకు తాము శభాష్ అనుకుంటున్నారు. ఇంతకూ వారేం చేస్తున్నారంటే.. కాంగ్రెస్ పథకాలకు ప్రచారం కల్పిస్తున్నారు. వారి పథకాలను పదే పదే గుర్తు చేస్తున్నారు. ఓ రకంగా బీఆర్ఎస్ ప్రచారం అంతా కాంగ్రెస్ సెంట్రిక్ గానే సాగుతోంది.
తమ ప్రచారాన్ని తామే పొగుడుకుంటున్న బీఆర్ఎస్
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో పెద్ద పెద్ద గ్రౌండ్లలో బహిరంగసభలు ఏర్పాటు చేసే అవకాశం లేదు. రోడ్ల మీద గల్లీల్లో రోడ్ షోలు పెట్టుకోవాలి. ఇందు కోసం ఓ సెటప్ ఏర్పాటు చేస్తున్నారు. చిన్న చిన్న స్క్రీన్లు పెట్టి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పథకాల గురించి చెప్పి .. అవి రావడం లేదని అందుకే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేయాలని అంటున్నారు. ఈ ప్రచారానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం కల్పిస్తోంది. రామన్న అద్భుతమైన స్ట్రాటజీతో ప్రజలకు సూటిగా సుత్తిలేకుండా చెప్పాలనుకున్నది చెబుతున్నారని చిటికెలు వేస్తున్నారు. అసలు ప్రచారం కన్నా ఈ ప్రచారానికి ప్రచారం కల్పించడానికే వారు ప్రాధాన్యమిస్తున్నారు.
అసలు ప్రచారం కన్నా ఈ ప్రచారమే ఎక్కువ
ప్రజల్లోకి దూసుకెళ్లిపోతోందని.. ప్రజలు చర్చించుకుంటున్నారని కూడా వారికి వారు వైరల్ చేసుకుంటున్నారు. ప్రజలకు రాజకీయ పార్టీల ప్రచారంపై పట్టించుకునే తీరిక ఉండదు. రోడ్ షోలకూ తీసుకు వచ్చిన వారు తప్ప.. స్వచ్చందంగా వచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అయినా బీఆర్ఎస్ పార్టీ మాత్రం సొంత ప్రచారాన్ని గొప్పగా పొగిడేసుకుంటున్నారు.
కాంగ్రెస్ పథకాలు ప్రచారం చేస్తే ఎవరికి లాభం?
కానీ ఇప్పుడు జరుగుతోంది ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలు కాదు. కాంగ్రెస్ పథకాలకు ప్రచారం ఇస్తే.. ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. ఆ పథకాలన్నీ ఇస్తున్నామని.. ఓడిస్తే ఒక్క పథకం కూడా రాదని వారు ఓటర్లను.. బీఆర్ఎస్ ప్రచారాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని బెదిరించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తమను తాము గొప్పగా ఊహించుకుంటూ.. ఊరూపేరూ లేని సర్వేలను చూపించుకుంటూ.. సంతృప్తి పడుతోంది. గ్రౌండ్ రియాలిటీని మాత్రం అర్థం చేసుకోవడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది .
