ఎదుటి వారిపై తప్పు చూపించే ముందు ముందు నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తాయన్న విషయాన్ని కొంత మంది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలాంటి వారిలో టీన్యూస్, సాక్,షి వంటివి ముందుండాలి. ఎందుకంటే అవి నేరుగా రాజకీయ పార్టీల యజమానుల చేతుల్లో ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనం దండిగా వాటికి దోచి పెట్టారు . ఇప్పుడు అధికారం పోయాక వేరే పత్రికలకు..మీడియాకు ప్రభుత్వం దోచి పెడుతోందని ఆరోపిస్తే.. పాత లెక్కలన్నీ బయటకు తీస్తారు. ఇప్పుడు అేద జరుగుతోంది. బిగ్ టీవీపై ఆధారాల్లేకుండా టీ న్యూస్ ఇవే ఆరోపణలు చేసింది. కానీ బిగ్ టీవీ మొత్తం టీ న్యూస్ కు..నమస్తే తెలంగాణకు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ప్రకటనలు మొత్తం బయటకు తీసి ప్రజల ముందు పెడుతోంది.
ఒక్క లైవ్‌కు ఆరున్నర లక్షలు టీ న్యూస్‌కు చెల్లింపు
బిగ్ టీవీకి ప్రస్తుత ప్రభుత్వం కోట్లు కుమ్మరిస్తోందని, ఒక్కో లైవ్ ప్రోగ్రామ్‌కు రూ. 6.5 లక్షలు వసూలు చేస్తున్నారంటూ నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనాలు కలకలం రేపాయి. అయితే, ఈ ఆరోపణలను బిగ్ టీవీ తీవ్రంగా ఖండించడమే కాకుండా, గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్కు జరిపిన చెల్లింపులను ఆధారాలతో సహా బయటపెడుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏస్ మీడియా పేరుతో సీఎం ప్రోగ్రామ్స్ లైవ్ కవరేజ్ చేస్తూ, ఒక్కో ప్రోగ్రామ్‌కు రూ. 6.5 లక్షలు వసూలు చేసింది ఎవరని నిలదీస్తోంది. ఆ సంస్థ వెనుకున్న బినామీలు ఎవరు, వారికి అప్పట్లో ఏ ప్రాతిపదికన అంత పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఆ పత్రాలను కూడా రిలీజ్ చేసింది.
ఎన్నికల ఏడాదిలో కళకళలాడిన టీ న్యూస్ ఖజానా
ఎన్నికల ఏడాది అయిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో నమస్తే తెలంగాణ, టీన్యూస్ సంస్థలకు అసాధారణ రీతిలో ప్రభుత్వ ప్రకటనలు దక్కడంపై ఇప్పుడు విచారణ జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. కేవలం ఒక్క ఏడాదిలోనే నమస్తే తెలంగాణకు రూ. 13.74 కోట్ల విలువైన యాడ్స్ వచ్చాయి. గ్రీన్ ఛానల్ ద్వారా ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి నెలా ఠంచనుగా బిల్లులు చెల్లించుకున్న చరిత్ర ఉన్నవారే, ఇప్పుడు వేరే మీడియా సంస్థలపై బురదజల్లుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
ప్రజాధనం లెక్కలన్నీ బయటకు రావాల్సిందే
ప్రస్తుత వివాదం కేవలం రెండు మీడియా సంస్థల మధ్య పోరులా కాకుండా, రాజకీయ పార్టీల ప్రయోజనాల చుట్టూ తిరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైన నీతి, అధికారం పోయాక మరో రకమైన విమర్శలు చేయడం రాజకీయ పక్షాలకు పరిపాటిగా మారింది. అయితే, బిగ్ టీవీ తనపై వస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూనే, గత పదేళ్లలో జరిగిన ప్రకటనల మాయాజాలాన్ని ప్రజల ముందు పెడుతోంది. పూర్తిగా బయటకు రావాలి కూడా !
