శివ సినిమా ఫిల్మ్మేకర్స్కి ఎన్నో పాఠాలు నేర్పింది. కొన్ని పాఠాలు కొందరు పాటించారు. ఇంకొన్ని ఓపిక లేక వదిలేశారు. అందులో సౌండ్ డిజైన్ ఒకటి. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఒప్పుకున్నారు. “రీ-రిలీజ్ కోసం శివ సినిమాను చూశాను. శివ తర్వాత ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో సౌండ్ ఎందుకు ఇంత క్వాలిటీగా రాలేదో అనిపించింది’ అని ఓ కామెంట్ చేశారు. ఇది నిజం. శివ తర్వాత ఆ స్థాయి సౌండ్ డిజైన్ కలిగిన సినిమా తెలుగులో మళ్ళీ రాలేదని చెప్పాలి.
ఒక ఫిల్మ్‌మేకర్ తన తొలి సినిమాను ఒక ఛాలెంజ్‌గా తీసుకుంటాడు. ప్రతి క్రాఫ్ట్‌లో అప్పటివరకూ ఉన్న ట్రెండ్‌కి భిన్నంగా ఏదో కొత్తగా చేయాలనుకుంటాడు. వరల్డ్ సినిమాలను లోతుగా అధ్యయనం చేసిన రామ్ గోపాల్ వర్మ, తెలుగులో ఎందుకు అంతటి సౌండ్ డిజైన్ రావడం లేదనే తపనతో శివలో ప్రతి సౌండ్ ఎఫెక్ట్‌ను ఎంతో ప్యాషన్‌తో సృష్టించాడు. అందుకోసం ఆయన రీసెర్చ్ చేసి, పాపులర్ సౌండ్ డిజైనర్స్‌తో కలిసి పని చేశాడు. అటువంటి గుర్తుండిపోయే సౌండ్ క్రాఫ్ట్‌కి కేవలం బడ్జెట్ కాదు, ఓపిక, సమయమూ అవసరం. శివ తర్వాత వర్మకు బడ్జెట్లు లభించినా, ఆ స్థాయి సౌండ్ డిజైన్‌కి అవసరమైన సమయం పీక మాత్రం ఆయన ఇవ్వలేకపోయాడు.
సౌండ్ డిజైన్ మాత్రమే కాదు.. హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో కూడా శివ లాంటి సినిమా మళ్ళీ రాలేదు. ఈ విషయాన్ని ఇటీవలే వర్మ స్వయంగా గుర్తుచేసుకున్నారు. “శివ క్యారెక్టర్లో ఆర్ద్రత వుంది. ఈ యూనిక్‌నెస్ నాకు 36 ఏళ్ల తర్వాత అర్థమైంది. శివ లాంటి ఆర్ద్రత వున్న క్యారెక్టర్ తో ఇప్పటివరకూ మరో సినిమా రాలేదు”అని సర్ప్రైజ్ అయ్యారు వర్మ.
