ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తమ యాంకర్ వెంకటకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బాధ్యత తీసుకుంది. గెట్ ఔట్ ఆఫ్ మై డిబేట్ అన్న మాటలపై చిందిస్తున్నామని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించింది. అయితే డిబేట్ లో జర్నలిస్టుల్ని బూతులు తిట్టిన రవీందర్ రావు కూడా ఇలాగే చేయగలరా అని ప్రశ్నించింది. ఆయన చేస్తారో లేదో కానీ ఏబీఎన్ మాత్రం తన తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసిందని అనుకోవచ్చు.
గతంలో వెంకటకృష్ణ డిబేట్ లోనే బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై… ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పట్లో అమరావతి ఉద్యమకారుడిగా ఉన్న కొలికపూడి శ్రీనివాస్ చెప్పు విసిరారు. అప్పట్లోనే ఈ అంశంపై ఆయనపై విమర్శలు వచ్చాయి. మోడరేటర్ గా ఉండి.. అలాంటి పరిస్థితి నివారించలేకపోయారని అనుకున్నారు. అప్పట్లో అమరావతి ఉద్యమం పీక్ లో ఉండటం.. విష్ణువర్దన్ రెడ్డి రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భావించడంతో పెద్దగా ఎవరూ స్పందించలేదు. కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా స్పందన మాత్రం టీవీ డిబేట్ లో అలా ఉండకూడదు.. ఆ పరిస్థితిని నివారించాల్సింది వెంకటకృష్ణయే.
ఇప్పుడు నేరుగా ఆయనే వివాదంలోకి వెళ్లారు. ఎదుటి వ్యక్తి అత్యంత ఘోరంగా మాట్లాడుతున్నప్పుడు.. ఆయనను ఎంత గౌరవంగా పిలిచారో అంతే గౌరవంగా డిబేట్ నుంచి తప్పించడానికి అవకాశం ఉంది. కానీ ఆ మార్గాన్ని ఎంచుకోకుండా ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యారు. అందుకే ఇప్పుడు చానల్ చింతిస్తున్నామన్న ప్రకటన చేసింది. కానీ బీఆర్ఎస్ కానీ.. ఇష్టం వచ్చినట్లుగా బూతులు మాట్లాడిన తక్కెళ్లపల్లి రవీందర్ రావు కానీ తమ నిర్ణయాల పట్ల చింతించే అవకాశం ఉండకపోవచ్చు. మీడియాకు ఉన్న విలువలు .. వారు తమకు అంటించుకోవాలని అనుకోకపోవచ్చు.
