విజయ్ గతంలో పార్టీ సమావేశంలో ఒంటరి పోటీ అని బహిరంగంగా ప్రకటించారు. తానే సీఎం అభ్యర్థినని ప్రకటించారు. అంతేనా.. అన్ని నియోజకవర్గాల్లో తానే అభ్యర్థినని కూడా చెప్పుకున్నారు. కానీ హఠాత్తుగా ఇప్పుడు పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించి అందులో .. పొత్తుల నిర్ణయం తీసుకునే అవకాశం విజయ్ కే ఇస్తూ తీర్మానం చేశారు. ఇప్పుడు హఠాత్తుగా ఈ తీర్మానం ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరూర్ ఘటన విజయ్ రాజకీయ జీవితాన్ని మార్చేస్తోంది.
కరూర్ ఘటన జరిగిన తర్వాత బయటకు రాని విజయ్
విజయ్ గొప్ప స్టార్ డమ్లో ఉన్న నటుడు. రాజకీయాల్లోకి వచ్చాక ఆ పరిస్థితులు నేరుగా అర్థమవుతాయి. కానీ తన ర్యాలీ వల్ల అంత మంది చనిపోయారన్న భావన, వారిని పట్టించుకోకుండా పారిపోయాడని నిందలు ఆయనను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. అలాగే విచారణలు కూడా భయపెడుతున్నాయి. మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో విజయ్ కు మరింత గుబులు పెరిగింది. కేసు సీబీఐకి వెళ్లింది కానీ.. ఆయన పూర్తిగా ట్రాప్ లో పడిపోయారని తమిళనాడు బీజేపీ వర్గాలకు అర్థం అయిపోయింది.
బీజేపీ వైపు కదలక తప్పని పరిస్థితి
కరూర్ కేసు సీబీఐకి వెళ్లకుండా ఉన్నట్లయితే.. తమిళనాడు ప్రభుత్వం విజయ్ పై ఎలాంటి చర్యలు తీసుకునేది కాదు. ఎందుకంటే సానుభూతి రాజకీయాల పవర్ ఏంటో స్టాలిన్ లాంటి వాళ్లకు బాగా తెలుసు. ఇతర పార్టీల నేతల్ని బాధ్యుల్ని చేసి.. విజయ్ పై తప్పు చేశాడన్న ప్రచారం మాత్రమే చేసేవాళ్లు. కానీ విషయం బీజేపీ చేతికెళ్లాక.. విజయ్ తప్పు చేశాడని సీబీఐ తేలిస్తే ఆయన రాజకీయ జీవితానికే గండం ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో బీజేపీ వైపు మెల్లగా అయినా మొగ్గాల్సిన పరిస్థితి వచ్చేసింది.
పొత్తులు పెట్టుకున్నా సిద్ధాంతాలు మారవని చెప్పి కలసి పోటీ
డీఎంకేను విజయ్ రాజకీయ శత్రువుగా ప్రకటించారు. బీజేపీని సిద్ధాంతపరమైన శత్రువుగా ప్రకటించారు. సిద్ధాంతాల విషయంలో బీజేపీ సర్దుకుపోతుంది. తమిళనాడులో అక్కడ పాలసీలను.. ప్రజాభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటుంది. అన్నాడీఎంకే అలాగే పొత్తులో ఉంది. విజయ్ కూడా అలా సర్దుకుపోయే పరిస్థితుల్ని కల్పిస్తారు. ఎన్నికల నాటికి విజయ్.. బీజేపీ కూటమిలో భాగంగా మారిపోతారు. ఇప్పటికి ఉన్న పిక్చర్ ఇదే అనుకోవచ్చు.
