బోరబండ ఎన్నికల సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను హిందువును… టోపీ పెట్టి, దొంగ నమాజ్ చేసి ఇతర మతాలను కించపర్చనని ప్రకటించారు.టోపీ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే తల నరుక్కుంటానన్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే బోరబండలో ఎన్నికల ప్రచారంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ తరహా రాజకీయం చేస్తారన్న కారణంగా ఆయన ప్రచారానికి పోలీసులు మొదట అనుమతి ఇవ్వలేదు. కానీ ఆయన మరింత దూకుడుగా వ్యవహరించి అనుమతి తెచ్చుకున్నారు. పెద్ద ఎత్తున కేంద్ర బలగాల భద్రత మధ్య ప్రచారం చేశారు.
లక్ష ఓట్ల కోసం ఒవైసీ చెప్పినట్లుగా వింటున్నారని రేవంత్ పై మండిపడ్డారు. రావు వచ్చినా, రెడ్డి వచ్చినా మేం చెప్పినట్లు వినాల్సిందేనని ఒవైసీ చెప్పినా పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెసోళ్లు అని మండిపడ్డారు. టోపీ పెట్టుకున్న రేవంత్ రెడ్డి ని చూస్తే సినిమా యాక్టర్ వేణుమాధవ్ గుర్తుకొచ్చాడని… అజహరుద్దీన్ చేత వక్రతుండ అని గణేష్ మంత్రం చదవించే దమ్ముందా అని సవాల్ చేశారు. ఒవైసీ సొదురులను భాగ్యలక్ష్మీ టెంపుల్ కు తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడించే దమ్ముందా అని సవాల్ చేశారు. జూబ్లిహిల్స్ హిందువులారా… 70 శాతం ఓట్ల సత్తా ఏందో చూపించాలని పిలుపునిచ్చారు. ఎంఐఎం నాయకులు చైన్ స్నాచర్స్…వాళ్లతో జాగ్రత్త ఉండాలన్నారు. పొరపాటున కాంగ్రెసోళ్లు గెలిస్తే ఆడవాళ్ల మెడలో ఉన్న మంగళ సూత్రం కూడా గుంజుకుపోతారు జాగ్రత్త అని సూచించారు.
మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణమని… గోపీనాథ్ తల్లి చెప్పిన మాట ఇదన్నారు. రేవంత్ కు దమ్ముంటే….గోపీనాథ్ చావుపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కు వావి వరసల్లేవు…. చిన్నా పెద్దా ముసలి ముతక అనే తేడా లేనే లేదు…. సీఎం పదవి కోసం ఏమైనా చేసే రకమన్నారు. కవిత… మీ తండ్రి వద్దకు పోయి అప్పుడప్పుడు బాగోగులు చూసుకో.. రాష్ట్రంలో ఏనుగులు తినేటోడు పోయి పీనుగలు పీక్క తినేటోడు వచ్చాడన్నారు.
