తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. గంటల్లోనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. రెండు వారాల్లో పోలింగ్ కూడా పూర్తయి ఫలితాలు వచ్చేస్తాయి. అంటే ప్రక్రియ అంతా మూడు వారాల్లో పూర్తయిపోతుందన్నమాట. తెలంగాణ ఎస్ఈసీ రాణి కుముదిని షెడ్యూల్ ప్రకటింటారు. బుధవారం నుంచే నామిషన్లు స్వీకరిస్తారు. 30వ తేదీ వరకూ నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఆ తర్వాత పదకొండు రోజుల్లో పోలింగ్ జరుగుతుంది. పదమూడున కౌంటింగ్ నిర్వహిస్తారు. 16వ తేదీన మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తారు. దాంతో ప్రక్రియ ముగిసిపోతుంది.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు క్షణం తీరిక ఉండని షెడ్యూల్ ను ఎస్ఈసీ ప్రకటించారు. షెడ్యూల్ కు నోటిఫికేషన్ కు గడువు ఉంటుందని అనుకున్నారు. అలాగే.. రెండు విడుతల్లో నిర్వహిస్తారని రాజకీయపార్టీలు అనుకున్నాయి. కానీ అలాంటిదేమీ లేదని.. కళ్లు మూసి తెరిచేంతలో ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. మొత్తం 116 మున్సిపాల్టీలు, ఏడు కార్పొరేషన్ల పాలక వర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. యాభై లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
కొద్ది రోజులుగా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావొచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గా ల వారీగా ఇంచార్జుల్ని నియమించి ఇప్పటికే అభ్యర్థులను కూడా ఖరారు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల బాధ్యతలను నియోజకవర్గాల ఇంచార్జులు, ఎమ్మెల్యేలకే ఇచ్చేసింది. బీజేపీ కొంత మేర కసరత్తు చేసినా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ఉన్న విభేదాల వల్ల .. గందరగోళం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.
