ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్‌కు అత్యవసరంగా ఆపరేషన్ నిర్వహించారు. శనివారం సాయంత్రం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ పూర్తి అయింది. శుక్రవారం ఉదయం అధికారులతో అధికారిక సమీక్షా సమావేశంలో పాల్గొన్న సమయంలో ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యుల సలహా మేరకు ఆ రోజు కార్యక్రమాలను రద్దు చేసుకుని వైద్య పరీక్షలకు వెళ్లారు. పరిస్థితిని గమనించిన వైద్యులు సర్జరీ తప్పనిసరని నిర్ణయించారు.
వైద్యులు నిర్వహించిన ఎంఆర్ఐ, ఇతర కీలక పరీక్షల నివేదికలను పరిశీలించిన అనంతరం, ఆపరేషన్ అవసరమని గుర్తించి వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేశారు. శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య బృందం వెల్లడించింది. అయితే, గత కొంతకాలంగా ఆయన పడుతున్న శారీరక శ్రమ , ఆరోగ్యపరమైన ఒత్తిడి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం.
ఆపరేషన్ అనంతరం పవన్ కళ్యాణ్ కనీసం వారం నుండి పది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆ తర్వాతే ఆయన పరిమితంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో స్వస్థత చేకూరడానికి మరికొంత సమయం పడుతుందని, దీర్ఘకాలం పాటు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు స్పష్టం చేశారు. జనసేన పార్టీ కార్యకలాపాలు , ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేపట్టాల్సిన పర్యటనలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి.
అయితే పవన్ కల్యాణ్‌కు ఏ తరహా అనారోగ్యం వచ్చిందన్నది మాత్రం ఆయన టీం ప్రకటించలేదు.
