మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో వీగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ మిత్రపక్షాలపై విరుచుకుపడ్డారు. ఈ వైఫల్యానికి కాంగ్రెస్తో పాటు దాని మిత్రపక్షాలైన టీఎంసీ, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీల స్వార్థ రాజకీయాలే కారణమని ఆయన విమర్శించారు. దశాబ్దాలుగా మహిళల హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్, ఈ చారిత్రాత్మక బిల్లును అడ్డుకోవడం ద్వారా తన పాత తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని చేజార్చుకుందని విమర్శించారు. ఈ బృహత్తర ప్రయత్నాన్ని పార్లమెంటు సాక్షిగా భ్రూణహత్య చేసిన విపక్షాలకు దేశ నారీశక్తి తగిన శిక్ష విధిస్తుందని ప్రధాని హెచ్చరించారు.
వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలు మహిళా సాధికారతను చూసి భయపడుతున్నాయని ప్రధాని ఆరోపించారు. తమ కుటుంబాలకు చెందని మహిళలు రాజకీయాల్లో ఎదిగితే, తమ నాయకత్వానికి ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళనతోనే ఈ బిల్లును వ్యతిరేకించారని మండిపడ్డారు. 2029 ఎన్నికల నాటికి మహిళలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే తన మహాయజ్ఞాని విపక్షాలు సాంకేతిక సాకులు చూపుతూ అడ్డంకులు సృష్టించాయని, మహిళల పురోగతిని అడ్డుకున్న అపరాధులుగా ఈ పార్టీలు చరిత్రలో మిగిలిపోతాయని మోదీ స్పష్టం చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన పై విపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. బ్రిటిష్ వారి కాలం నాటి విభజించి పాలించు సూత్రాన్ని కాంగ్రెస్ నేటికీ అమలు చేస్తోందని, పునర్విభజన సాకుతో దేశంలో ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఏ రాష్ట్ర ప్రాతినిధ్యం తగ్గకుండా, అన్ని రాష్ట్రాల సీట్లను సమాన నిష్పత్తిలో పెంచుతామని ప్రభుత్వం మొదటి నుంచీ చెబుతున్నప్పటికీ, కాంగ్రెస్ , దాని మిత్రపక్షాలు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించే పార్టీల తీరుపై మోదీ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఒక పరాన్నజీవి లా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడుతూ, వాటి భవిష్యత్తును కూడా ప్రమాదంలోకి నెడుతోందని విమర్శించారు. 21వ శతాబ్దపు మహిళలు ప్రతిపక్షాల కుట్రలను నిశితంగా గమనిస్తున్నారని, నిజానిజాలను గ్రహించిన ప్రజలు త్వరలోనే విపక్షాలకు తగిన గుణపాఠం చెబుతారని ప్రధాని మోదీ హెచ్చరించారు. మహిళల హక్కుల సాధన కోసం తన పోరాటం కొనసాగుతుందని, ఈ అడ్డంకులను అధిగమించి మహిళా సాధికారతను సాకారం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
మొత్తంగా ప్రధాని మోదీ జాతినుద్దేశించిచేసిన ప్రసంగం… తమిళనాడు , బెంగాల్ ఎన్నికల్లో మహిళలను ..బిల్లు వ్యతిరేకించిన డీఎంకే, టీఎంసీలకు వ్యతిరేకంగా మహిళలను ఆవేశపరచడానికి ఉపయోగించారని అనుకోవచ్చు. ఓ రకంగా ఎన్నికల ప్రచారం తరహాలోనే సాగింది.
