మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుల ఓటింగ్ వ్యవహారంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరించిన వైఖరిపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంధించిన ప్రశ్నలు ఇప్పుడు వైసీపీ శిబిరంలో కలకలం రేపుతున్నాయి. కేంద్రం చేస్తున్న అన్యాయానికి జగన్ ఎందుకు వత్తాసు పలుకుతున్నారని ఆమె సూటిగా ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బలహీనపరిచే అక్రమ డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు తెలపడం ద్వారా జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి బానిస మారారని, తన అవినీతి కేసుల నుంచి రక్షణ కోసమే ఈ అక్రమ పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని, ఇప్పుడు దానిని డీలిమిటేషన్తో ముడిపెట్టడం జగన్ అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. కులగణన లేకుండా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సంఖ్య తేలకుండా సీట్లు పెంచడం దేశాన్ని మోసం చేయడమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను మంటగలిపి బీజేపీకి జై కొట్టడం ద్వారా జగన్ వైఎస్సార్ ఆశయాలకు తూట్లు పొడిచారని , ఆయన ఆత్మ ఘోషించేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడూ షర్మిల లేవనెత్తిన ప్రజా సమస్యలకు సమాధానం చెప్పలేక, వైసీపీ నేతలు షర్మిలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం పరిపాటిగా మారింది. ఆమె చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారనో, బాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారనో అనడం తప్ప.. డీలిమిటేషన్ వల్ల ఏపీకి జరిగే సీట్ల నష్టంపై జగన్ వైఖరి ఏంటో స్పష్టం చేయలేకపోతున్నారు.
మహానేత వైఎస్సార్ ఆశయాలను జగన్ మంటగలిపారని షర్మిల చేసిన వ్యాఖ్యలు వైసీపీని తీవ్ర ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. రాజ్యాంగ పరిరక్షణ కంటే మోదీ భజనే ముఖ్యం అని జగన్ భావిస్తున్నారని ఆమె చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే ధైర్యం వైసీపీ నేతలకు ఉండటం లేదు. షర్మిల సంధించిన అస్త్రాలు వైసీపీ ఓటు బ్యాంకును ఆలోచనలో పడేస్తున్నాయి. ఒకవైపు దక్షిణాది సెంటిమెంట్, మరోవైపు మహిళా రిజర్వేషన్ల డ్రామాను వివరిస్తూ ఆమె వేస్తున్న అడుగులు జగన్ మోహన్ రెడ్డికి రాజకీయంగా సంకటంగా మారాయి.
