దేశంలో ఎన్నికల అంచనాలకు మారుపేరుగా నిలిచే యాక్సిస్ మై ఇండియా సంస్థ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసే ప్రేక్షకులకు షాక్ ఇస్తూ.. బెంగాల్ ఎగ్జిట్ పోల్ అంచనాలను తాము విడుదల చేయడం లేదని ఆ సంస్థ అధినేత ప్రదీప్ గుప్తా ప్రకటించారు. ఒక సర్వే సంస్థ తన ఫలితాలను వెల్లడించడానికి నిరాకరించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
పశ్చిమ బెంగాల్లోని 294 నియోజకవర్గాల్లో 80 బృందాలతో దాదాపు 13,250 మంది ఓటర్లను సర్వే చేసినట్లు సంస్థ తెలిపింది. అయితే, క్షేత్రస్థాయిలో ఓటర్ల ప్రవర్తన అత్యంత విచిత్రంగా ఉందని ప్రదీప్ గుప్తా పేర్కొన్నారు. సర్వే కోసం సంప్రదించిన ఓటర్లలో ఏకంగా 70 శాతం మంది తమ మనసులో మాట చెప్పడానికి నిరాకరించారని.. బెంగాల్ రాజకీయాల్లో ఉండే తీవ్రమైన ఉద్రిక్తతల వల్ల కావచ్చు లేదా మరే ఇతర కారణాల వల్ల కావచ్చు, ఓటర్లు తమ ఓటు ఎవరికో చెప్పడానికి తీవ్రంగా సంకోచించినట్లు సంస్థ గుర్తించింది.
కేవలం 30 శాతం మంది ఇచ్చిన సమాచారంతో అంచనాలు వేయడం శాస్త్రీయంగా తప్పు అని, అది డేటా విశ్వసనీయతను దెబ్బతీస్తుందని ప్రదీప్ గుప్తా స్పష్టం చేశారు. మా సంస్థకున్న ట్రాక్ రికార్డ్, పారదర్శకతను కాపాడుకోవడం మాకు ముఖ్యం. తప్పుడు లెక్కలతో ప్రజలను అయోమయానికి గురిచేసే కంటే, ఫలితాలను ఆపేయడమే బాధ్యతాయుతమైన పని అని భావించాం అని ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
సాధారణంగా ఏ సర్వే సంస్థ అయినా తమ అంచనా తప్పినా పర్వాలేదని ఫలితాలను వెల్లడిస్తుంది. కానీ, యాక్సిస్ మై ఇండియా వంటి సంస్థ నాన్-రెస్పాన్స్ రేట్ ఎక్కువగా ఉందని ఫలితాలను ఆపడం ద్వారా బెంగాల్ ఎన్నికల్లో సైలెంట్ ఓటింగ్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా పరోక్షంగా బెంగాల్ తీర్పు అత్యంత అనూహ్యంగా ఉండబోతోందనే సంకేతాన్ని ఆ సంస్థ ఇచ్చినట్లయింది.
