ఏపీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, ఆయన అన్న శరత్ చంద్రారెడ్డి మాట మారుస్తున్నారు. ఆంధ్ర లిక్కర్ స్కాంలో వారిని సీఐడీ సిట్ సాక్షులుగా నమోదు చేసింది. వారు ఇచ్చిన వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించింది. అయితే వారు మాత్రం ఇప్పుడు తాము ఇచ్చిన వాంగ్మూలాలను వెనక్కి తీసుకుంటామని కోర్టులో పిటిషన్లు వేశారు. తాము చెప్పని మాటల్ని సీఐడీ నమోదు చేసుకుందని అందుకే తమ సాక్ష్యాలను వెనక్కి తీసుకుంటామని వారు వాదిస్తున్నారు. వారు ఇచ్చిన వాంగ్మూలపై ఆడియో,వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆ పిటిషన్ చెల్లదని సీఐడీ అంటోంది.
జగన్ గురించి మొత్తం చెప్పారా ?
వాంగ్మూలాలు ఇచ్చిన చాలా కాలం తర్వాత కోర్టులో పిటిషన్లు వేయడం.. తాము చెప్పనివి రాసుకున్నారని వాదించడంతో అసలు వారేం చెప్పారన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. లబ్దిదారు జగన్ రెడ్డేనని తమ కంపెనీలను ఆయన ఓ టూల్ గా వాడుకున్నారని..తాము రూపాయి కూడా సంపాదించలేదని వారు చెప్పుకున్నట్లుగా .. వాంగ్మూలం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకే ఇప్పుడు వారిపై ఒత్తిడి పెరగడంతో వెనక్కి తీసుకుంటామని పిటిషన్ వేసినట్లుగా చెబుతున్నారు.
లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర
లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. అదాన్ డిస్టిలరీస్ కంపెనీ శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డిదేనని గతంలో వివరాలు బయటకు వచ్చాయి. అయితే అది కేసిరెడ్డి నడిపించారని..తాను తన అల్లుళ్ల నుంచి వంద కోట్ల రుణం ఇప్పించానని విజయసాయిరెడ్డి చెప్పుకుంటున్నారు. అది రుణమో ..లంచమో పోలీసులు తేలుస్తారు.ఇదే అంశంపై వారిచ్చిన వాంగ్మూలాన్ని సీఐడీ సిట్ నమోదు చేసింది. ఇది జరిగి చాలా కాలం అయింది. అయితే ఇప్పుడు హఠాత్తుగా తమ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటామని కోర్టులో పిటిషన్ వేశారు.
తెర వెనుక ఏం జరుగుతోంది ?
విశాఖలో ఎన్నో భూదందాల్లో రోహిత్ రెడ్డి పేరు ఉంది. బీచ్ ను నాశనం చేశారని ఆయనపై , ఆయన భార్యపై కేసులు నమోదయ్యాయి. ఇక శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలుకెళ్లి అప్రూవల్ గా మారి బెయిల్ తెచ్చుకున్నారు. ఏపీలో వైసీపీ ఉన్న సమయంలో వారు చాలా ఆస్తులు అక్రమంగా పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ వ్యవహారంలోనూ వారు లబ్ది పొందారు. విజయసాయిరెడ్డి అనధికారిక అప్రూవర్ గా మారి అన్ని వివరాలు చెబుతున్నారని అనుకుంటున్నారు కానీ..ఇప్పుడు రివర్స్ అయ్యేలా చేయడం మాత్రం ఆసక్తికరంగా మారింది.
వాంగ్మూలాన్ని ఆషామాషీగా నమోదు చేస్తారా?
వారిని సాక్షులుగా తీసుకున్న తర్వాత సీఐడీ సిట్ అధికారులు వారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అది కోర్టులో సమర్పించాల్సిన లీగల్ డాక్యుమెంట్. అలాంటి దాన్ని వారు ఆషామాషీగాచెప్పని నమోదు చేసే అవకాశం ఉండదు. ఆడియో.. వీడియోలను కూడా రికార్డు చేస్తారు. అయినా కోర్టులో పిటిషన్లు వేశారు.
