జగన్ రెడ్డి పొగుడుతారని ఆయన దృష్టిలో పడవచ్చని విదేశాల్లో ఉండి ఇష్టం వచ్చినట్లుగా బూతులందుకున్న ఓ భాస్కర్ రెడ్డి తప్పనిసరిగా ఇండియాకు వచ్చి దొరికిపోయారు. తండ్రి చనిపోవడంతో అంత్యక్రియలకు లండన్ నుంచి వచ్చాడు. అన్నీ పూర్తయ్యే వరకూ వేచి ఉన్న పోలీసులు పట్టుకున్నారు. ఆ భాస్కర్ రెడ్డి సోషల్ మీడియా పైత్యం చూస్తే.. ఎలాంటి శిక్ష వేసిన తప్పు లేదనుకుంటారు. ఘోరమైన భాషకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.
అయితే ఆయనను అరెస్టు చేశారని తెలిసిన తర్వాత వైసీపీ నుంచి ఎవరూ పట్టించుకోకపోవడమే విచిత్రం. రెండు ట్వీట్లు వేసి అదే మద్దతని అనుకుంటున్నారు. కనీసం న్యాయ సాయం అయినా చేస్తున్నారా అంటే అదీ లేదు. చివరికి భాస్కర్ రెడ్డి కుటుంబమే లాయర్లను మాట్లాడుకోవాల్సి వచ్చింది. నెల్లూరులోని ఓ పేద కుటుంబం అయిన భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ.. కృష్ణా జిల్లాలోని చోడవరం గ్రామానికి బతుకుదెరువు కోసం వచ్చారు. లండన్ వెళ్లిన భాస్కర్ రెడ్డి అక్కడ ఓ చిన్న దుకాణం నడుపుతున్నారు.
తాను చేసే పనులు తన జీవితం మీద దెబ్బకొడతాయని ఆయన అనుకోలేకపోయారు. ఎంతో కొంత డబ్బులు వస్తాయని ఆశపడ్డారు. ఇప్పుడు ఆయన బతుకు రోడ్డున పడింది. వైసీపీ అంతంత మాత్రంగా పట్టించుకుంటోంది. దీని ద్వారా ఎదురవ్వబోయే పరిణామాలన్నింటినీ ఆయనే భరించాల్సి ఉంది. ఇది ఒక్క భాస్కర్ రెడ్డి బాధ కాదు. ఆ పార్టీలో బూతులే సర్వస్వం.. అధికారం శాశ్వతం అనుకున్న వారందరిదీ అదే బాట. విదేశాల్లో ఉన్నామని తమను ఏమీ చేయరని అనుకుంటే అడ్డగోలుగా బుక్కయిపోతారు. ఇంకా చాలా మంది లిస్టులో ఉన్నారు.. వారందరూ ఇక్కడికి రాలేరు.. బయట బతకలేరన్నట్లుగా పరిస్థితి మారుతుంది.
