ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధుల కోసం బంద్ చేస్తున్న ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలపై సీఎం రేవంత్ కన్నెర్ర చేశారు. వారేమీ ప్రజాసేవ చేయడం లేదని..వ్యాపారమే చేస్తున్నారని గుర్తు చేస్తూ ఇక నుంచి ఫీజులు వసూలు చేస్తారా.. డొనేషన్లు వసూలు చేస్తారా అని నర్మగర్భంగా ప్రశ్నించారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికలపై మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు చేస్తున్న హడావుడిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల పేర్లను సైతం ప్రస్తావించి వార్నింగ్ ఇచ్చారు.
కాలేజీలు బంద్ పెట్టి.. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఫీజులు అడుగుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాట తీస్తామని హెచ్చరించారు. కాలేజీల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్ లు పెట్టేందుకు పర్మిషన్లు అడిగారని అవి ఇవ్వనందుకే ఇవన్నీ చేస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీలతో కుమ్మక్కయి ఎన్నికలకు ముందు ఈ హడావుడి చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ హయాంలో బకాయిలు మూడున్నర వేల కోట్లు ఆయననే అడగాలని.. తమ హయాంలో అయిన ఫీజులు మాత్రం చెల్లిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. కాలేజీల్లో ఇప్పటికే తనిఖీలకు సీఎం ఆదేశించారు. సౌకర్యాలు ఉన్నాయో లేదో తనిఖీలు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు.
మాటలతో పని కాదని రేవంత్ నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా ఆయన హెచ్చరికలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఖచ్చితంగా ఎన్నికలకు ముందే కుట్ర పూరితంగాకాలేజీలు చేస్తున్న ఆందోళన రేవంత్ ను మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. జూబ్లిహిల్స్ పోల్స్ అయిపోయిన వెంటనే .. ఆయన ప్రైవేటు కాలేజీల సంగతి చూస్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది.అయితే ఈ లోపే కాలేజీల యాజమాన్యాలు రాజీ పడిపోయి..బంద్ ను విరమించే అవకాశాలు కూడా ఉన్నాయి.