తెలుగుదేశం పార్టీకి ప్రజల్ని నిర్లక్ష్యం చేసే ఎమ్మెల్యేలే సమస్యగా మారుతున్నారు. తమకు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి..తమకు ఆర్థిక కష్టాలు ఉండవు కాబట్టి పేద ప్రజలకూ ఉండవని అనుకుంటున్నారు. ప్రజలకు , కార్యకర్తలకు ప్రభుత్వం, పార్టీ తరపున అందించాల్సిన సాయాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి వారు సాధారణంగా రాజకీయాలకు అనర్హులు. ప్రజల్ని పట్టించుకోని రాజకీయ నేతలు రాజకీయాలకు ఎలా అర్హువుతారు? అందుకే వీరి విషయంలో చంద్రబాబు కీలక చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అందాల్సిన సాయంపై నిర్లక్ష్యమా ?
పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చెక్కులు, ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడానికి కూడా తీరిక లేని ఎమ్మెల్యేలు ఏం చేస్తూంటారు?. దందాలు చేసుకుని సంపాదించుకుంటూ ఉంటారా?. ఇవి చిన్న విషయాలుగా భావిస్తే వారిని ఇక పూర్తిగా పక్కన పెట్టడమే మంచిది. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే.. వారికి చేయాల్సిన సాయాన్ని చిన్నదిగా భావించే ఎమ్మెల్యేలు ఎప్పటికీ ప్రజా జీవితానికి అర్హులు కాదు. చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పినా కొంత మంది ఎమ్మెల్యేల తీరు మారడం లేదు.
పేదల రూపాయి వేరు.. పెద్దల రూపాయి వేరు !
పెద్దల రూపాయికి ఉండే విలువకు.. పేదల రూపాయికి ఉండే విలువకు చాలా తేడా ఉంటుంది.సీఎంఆర్ఎఫ్ సాయం ఆషామాషీగా చేయరు. ఆ మేరకు ఆ కుటుంబం ఆర్థికంగా ఏదో విపత్తు వల్ల చితికిపోయి ఉంటేచేస్తారు. సీఎంఆర్ఎఫ్ వల్ల చేసే సాయంతో ఆ కుటుంబం రోడ్డున పడదు.కానీ ఎంతోకొంత రిలీఫ్ ఉంటుంది. అలాంటి సాయం చెక్కు వచ్చిన మూడు నెలలు కూడా ఇవ్వకుండా.. చెక్కు కాలం తీరిపోయేలా వ్యవహరించడం అంటే.. ఎమ్మెల్యేగా విఫలమైనట్లే. అతడికి ప్రజాప్రతినిధిగా ఉండే అర్హతే ఉండదు. ఇక కార్యకర్తలు చనిపోతే ఇచ్చే ఇన్సూరెన్స్ పత్రాలను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు కొందరు. వీరందరి పేర్లను గుర్తించారు కాబట్టే చంద్రబాబు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.
నోటీసులు కాదు..అంతకు మించి చేయాలి !
నిమ్మల రామానాయుడు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలాంటి నేతలు ఎందుకు ప్రజాభిమానంతో ప్రతీ సారి గెలుస్తున్నారో టీడీపీ ఎమ్మెల్యేలు ఆలోచించడం లేదు. వారిలా. ఇరవై నాలుగు గంటలు ప్రజలకు సమయం కేటాయించలేకపోతే .. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అంతే కానీ తాను లేకపోతే ఏమీ నడవకూడదు..తనకు కుదరదు అని అనుకుంటే.. అది ప్రజల్ని ఇబ్బందిపెట్టడమే. చంద్రబాబునాయుడు ఈ విషయంలో ఈ 48 మంది ఎమ్మెల్యేలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసి..దారికి వచ్చేలా చేయాలి. రాని వారు.. ప్రజల్ని పట్టించుకోకుండావారు చేస్తున్న దందాల్ని బయటపెట్టి.. ప్రజా జీవితంలో లేకుండా చేసే ప్రయత్నం చేయాలన్నది సగటు వ్యక్తి కోరిక.


