బీజేపీకి ఓటేస్తే ప్రజలకు ఏం వస్తుందంటే మిగతా బీజేపీ నేతలు చాలా చెబుతారు. కేంద్రం నిధులతో విద్యాలయాలు, వైద్యాలయాలు తెస్తామంటారు. లోకల్ లీడర్లు నిజమైన ఆలయాల గురించి మాట్లాడతారు. బండి సంజయ్ కి మాత్రం అవన్నీ ఔటాప్ సిలబస్. ఆలయాల గురించి మాట్లాడినా.. అదొక్కటే ఆయన అజెండా కాదు. ఇంకా చాలా ఉంటాయి. వాటన్నింటినీ జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో ప్రజల ముందు ఉంచుతున్నారు.
ముస్లిం టోపీ గురించి.. . హిందువుల ఐక్యత గురించి చాలా చెప్పిన ఆయన తాజాగా మరో బంపరాఫర్ ఇచ్చారు. అదేమిటంటే జూబ్లిహిల్స్ పేరు సీతారంపురంగా మార్చేస్తారట. జూబ్లిహిల్స్ లో బీజేపీకి ఓటేసి గెలిపించాలి కానీ.. జూబ్లిహిల్స్ అనే పేరే లేకుండా చేస్తామని హామీ ఇస్తున్నారు. బండి సంజయ్ ఆఫర్ విని అందరూ ముక్కును వేలేసుకోవాల్సి వచ్చింది.
బీజేపీ ఓ పాలసీ పెట్టుకుంది. ఆ పాలసీ ప్రకారం ముస్లింల పేర్లతో ఉన్న పట్టణాల పేర్లను మారుస్తుంది.అయితే ఈ పాలసీ యూపీలో మాత్రమే పలు చేస్తున్నారు. ఇంకెక్కడా అమలు చేయడం లేదు. కరీంనగర్ పేరును.. హైదరాబాద్ పేరును మార్చేస్తామని అప్పుడప్పుడూ చెబుతూంటారు. ఎందుకంటే ఆ రెండు పేర్లలో ముస్లిం పేర్లున్నాయట. కానీ జూబ్లిహిల్స్ పేరు మారుస్తామని బండి సంజయ్ అంటున్నారు. జూబ్లిహిల్స్ అనేది ముస్లిం పేరు కాదు. మరి మార్చాలని ఆయన ఎందుకనుకుంటున్నారో అర్థం కాని విషయం.
జూబ్లిహిల్స్ రిచ్ నేమ్ గా స్థిరపడిపోయింది. ఆ ఏరియాకు ఆ పేరు ఉండటం ఎవరికీ అభ్యంతరం లేదు. సీతారాంపురం అని మార్చే ప్రకటన ప్లస్ అవుతుందని బండి సంజయ్ ఎందుకనుకున్నారో కానీ ఆ ప్రకటన రివర్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.