తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేస్తున్న కవిత బీఆర్ఎస్ పై, హరీష్ రావుపై తన ఆరోపణలు కొనసాగిస్తున్నారు. తాజాగా వరంగల్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీష్ రావుపై కీలక ఆరోపణలు చేశారు. వరంగల్ లో బీఆర్ఎస్ హయాంలో భారీ ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ ఆస్పత్రి నిర్మిస్తోంది హరీష్ రావు బినామీనేనని కవిత ఆరోపించారు. విజిలెన్స్ విచారణలు జరిపించినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కవిత ప్రశ్నించారు. గతంలో హరీష్ రావుకు, రేవంత్ కు మధ్య డీల్ ఉందని కవిత ఆరోపణలు చేశారు. హరీష్ రావుపై తప్ప అందరిపై కేసులు నమోదవుతున్నాయన్నారు. ఇప్పుడు అవే అనుమానాలను వరంగల్ ఆస్పత్రి విషయంలోనూ వ్యక్తం చేశారు.
మరో వైపు తనను కుటుంబం నుంచి కూడా దూరం పెట్టారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తెగా కేసీఆర్ తనను పిలిస్తే ఇంటికి వెళతానన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను అన్యాయంగా .. అగౌరవంగా పంపించేశారని.. ఎందుకు సస్పెండ్ చేశారో తనకు ఇంత వరకూ చెప్పలేదన్నారు. తాను తప్పు చేస్తే షోకాజ్ నోటీసు ఇవ్వాలన్నారు. అది కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు రాజకీయం కోసమే ఉన్నాయని.. ప్రజల కోసం పని చేయడం లేదన్నారు.
జనం బాట కార్యక్రమం రాజకీయం కాదని కవిత అంటున్నారు. కానీ ఖచ్చితంగా రాజకీయాలు చేస్తానని .. మహిళలు తల్చుకుంటే ఎలాంటి రాజకీయాలు చేయగలరో చూపిస్తానన్నారు. కవితను రాజకీయంగానే కాకుండా.. కుటుంబ పరంగా దూరం పెట్టడమే ఆశ్చర్యకరంగా మారింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కొన్ని కుటుంబకార్యక్రమాలకు కవితకు ఆహ్వానం రాలేదు. హరీష్ రావు తండ్రి చనిపోయినప్పుడు కవిత వెళ్లి పరామర్శించినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.