వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు ఈ మధ్య సోషల్ మీడియా పిచ్చి పట్టుకుంది. ఎక్కడికి వెళ్లినా కెమెరామెన్ ను వెంట పెట్టుకుని వెళ్తున్నారు. అన్నీ వీడియోలు తీయించుకుంటున్నారు. తర్వాత నీట్ గా ఎడిట్ చేయించుకుని సోషల్ మీడియాలోఅప్ లోడ్ చేస్తున్నారు. వ్యక్తిగత విషయాలే ఇవి. రాజకీయ అంశాలపై తక్కువగా ఉంటాయి. ఇటీవల తన పొలాల్లోకి వెళ్లినప్పుడు.. అమెరికా వెళ్లినప్పుడు .. ఇప్పుడు తిరుపతికి వెళ్లినప్పుడు కూడా వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. అయితే ఆయన ఇక్కడ రాజకీయ అభిప్రాయాలకు తావివ్వడం లేదు. తాను ఏది చెప్పాలనుకుంటున్నారో అదే చెబుతున్నారు. అందుకే ఆయన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తిరుమల నిర్వహణ గురించి గొప్పగా చెప్పిన అంబటి
తిరుమల శ్రీవారి దర్శనానికి అంబటి రాంబాబు వెళ్లి వచ్చారు. వందే భారత్ లో వెళ్లి.. వస్తూ వీడియో తీశారు. తిరుమల శ్రీవారి అన్న ప్రసాదం గురించి గొప్పగా చెప్పారు.రుచిగా శుచిగా ఉందని.. ప్రశంసించారు. ప్రభుత్వం మారినప్పటి నుండి సామాన్య భక్తులు చెబుతున్న మాటే ఇది. కానీ అంబటి రాంబాబు లాంటి కరుడుగట్టిన వైసీపీ నేత చెప్పడం మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు చేయడానికి.. అక్కడేమీ జరగకపోయినా ఏదో జరిగిందని ప్రచారం చేయడానికి భూమన నేతృత్వంలో ఓ పెద్ద ముఠానే పని చేస్తోంది. అలాంటి సమయంలో ఇలా అంబటి రాంబాబు కామెంట్స్ చేయడం అనూహ్యమే.
జగన్కు నచ్చదని తెలిసీ ఎందుకు రిస్క్ చేశారు?
కూటమి ప్రభుత్వం గురించి ఎవరైనా పాజిటివ్ గా చెబితే జగన్ రెడ్డికి అసలు నచ్చదు. ఈ విషయం బయట వారి కన్నా వైసీపీ నేతలకు ముఖ్యంగా జగన్ తో సన్నిహితంగా ఉండే అంబటి రాంబాబు లాంటి వారికి బాగా తెలుసు. అయినా ఆయన పట్టించుకోలేదు. తన అనుభవాన్ని తాను చెప్పారు. ఈ వీడియోను వైసీపీ నాయకులు .. వారి మీడియా పట్టించుకోదు. కానీ టీడీపీ నేతలు.. టీడీపీ సానుభూతి పరులు మాత్రం వైరల్ చేస్తారు. ఇది జగన్ రెడ్డి వద్ద మైనస్ మార్కులకు కారణం అవుతుంది. అయినా అంబటి రిస్క్ చేశారు.
అంబటిని దూరం చేసుకునేంత ధైర్యం జగన్ చేయకపోవచ్చు !
అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత అందరూ కలుగులోకి పోతే.. పేర్ని నాని, అంబటి రాంబాబు మాత్రమే పార్టీ కోసం ఎదురు నిలబడి రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. హెచ్చరిలు జారీ చేస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ గురించి.. అంబటి రాంబాబు తన కుక్క కూడా భయపడదని అంటున్నారు. ఇలా మాట్లాడే నేతను దూరం చేసుకుంటే.. జగన్ రెడ్డికి ఇక పేర్ని నాని మాత్రమే మిగులుతారు. అందుకే టీటీడీని పొగిడినా అంబటి రాంబాబు జోలికి జగన్ రారని అనుకుంటున్నారు.


