ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో `రాజాసాబ్` ఒకటి. జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామంటూ.. చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. కానీ రిలీజ్ డేట్ చుట్టూ ఎన్నో అనుమానాలు. ఈ సినిమా ఓటీటీ హక్కులు ఇంకా అమ్ముడుపోలేదని, షూటింగ్ ఇంకా బాకీ ఉందని, రీషూట్లు జరుగుతున్నాయని, పండక్కి రాకపోవొచ్చని ఇలా రకరకాల వార్తలు. దానికి తగ్గట్టుగానే విజయ్ తమిళ సినిమానీ జనవరి 9నే విడుదల చేస్తున్నారు. ప్రభాస్ లేడు కాబట్టే… జనవరి 9న విజయ్ సినిమాని తీసుకొస్తున్నారన్న ఓ వార్త చక్కర్లు కొట్టడం మొదలెట్టింది.
అయితే ఈసినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 9నే విడుదల చేయడానికి నిర్మాతలు ఫిక్సయ్యారు. చిత్రబృందంలోని కీలక సభ్యుడు, మారుతికి అత్యంత సన్నిహితుడైన ఎస్.కే.ఎన్ ఈరోజు ఓ ట్వీట్ చేశారు. ‘పండక్కి వస్తున్నాం.. పండగ చేస్తున్నాం’ అంటూ పరోక్షంగా రాజాసాబ్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. దాంతో రాజాసాబ్ రిలీజ్ ఖాయమైనట్టే అని ఫ్యాన్స్ ఇప్పుడే పండగ సంబరాలు మొదలెట్టేశారు. కాకపోతే.. జనవరి 9న వస్తుందా, లేదంటే ఓ రోజు ఆగి విడుదల అవుతుందా అనేది చూడాలి.
రాజాసాబ్ నుంచి ఓ పాట బయటకు రావాల్సివుంది. అయితే… ఇప్పటి వరకూ ఆ పాట రానే లేదు. దీనిపై చిత్రబృందం కూడా ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. షూటింగ్ మొత్తం అయిపోయినా, ఇంకా పాట రాకపోవడం ఏమిటన్నది అభిమానుల ప్రశ్న. ట్రైలర్ మాత్రం విడుదలకు 100 రోజుల ముందే బయటకు వదిలేశారు. ఓ అగ్ర హీరో సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇంత త్వరగా బయటకు రావడం ఇదే తొలిసారి. రిలీజ్ టైమ్ లో మరో ట్రైలర్ రాబోతోంది. ఈలోగా పాటలూ బయటకు వచ్చేస్తే ఫ్యాన్స్ ఖుషీ అవుతారు.


