గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రతి హీరోయిన్‌కి మంచి పెర్ఫార్మర్గా గుర్తింపు రావాలనే కోరిక ఉంటుంది. ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా, ప్రేక్షకుల చేత ‘అద్భుతమైన నటి’ అనే పేరు తెచ్చుకోవడంలో వచ్చే కిక్కు వేరు. భాగ్యశ్రీ బోర్సే కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. ‘మిస్టర్ బచ్చన్’తో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న భాగ్యశ్రీ, ఆ తర్వాత వచ్చిన కింగ్డమ్లో ఆమె పాత్ర కోతకు గురైంది. అయితే ఇప్పుడు చేస్తున్న కాంతలో నటిగా తనకు కావాల్సిన గుర్తింపు దక్కుతుందనే నమ్మకం వ్యక్తం చేసింది.
“మిస్టర్ బచ్చన్ కంటే ముందే కాంత కథ విన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యంగా ప్రారంభమైంది. ఆ గ్యాప్‌లో మరో రెండు సినిమాలు చేశాను. టెక్నికల్‌గా నేను మొదట సైన్ చేసినది కాంతనే. ఒక కొత్త అమ్మాయికి ఇలాంటి పాత్ర దొరకడం అదృష్టం. ఈ పాత్రను ఒక ఛాలెంజ్‌గా తీసుకొని చేశాను. ఇందులో కుమారిగా కనిపిస్తాను. ఈ సినిమా కోసం పాత తెలుగు, తమిళ సినిమాలు చూశాను. శ్రీదేవి గారు, సావిత్రి గారి నటన గమనించాను. వాటినన్నింటినీ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఈ సినిమా తర్వాత కేవలం కమర్షియల్ కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలకు కూడా నన్ను సంప్రదిస్తారని నమ్ముతున్నాను”అంటోంది భాగ్యశ్రీ. దుల్కర్ సల్మాన్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది.

