కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధంగా లేని జగన్మోహన్ రెడ్డి కావాలంటే వీడియో కాల్ లో హాజరవుతానంటూ చేసిన విజ్ఞప్తిని సీబీఐ కోర్టు తోసి పుచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను జగన్ లాయర్ ఉపసంహరించుకున్నారు.అయితే తనకు కాస్త సమయం కావాలని కోరారు. వారం రోజుల్లో హాజరవుతానని చెప్పారు. దీంతో ఈ నెల 21న హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.
గత నెలలో విదేశీ పర్యటనకు వెళ్తానని అనుమతి కోసం జగన్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కు అనుమతించిన సీబీఐ కోర్టు.. విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని షరతు పెట్టింది. అయితే జగన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత మాట మార్చారు. తాను కోర్టుకు రావాలంటే ప్రభుత్వం చాలా భద్రతా ఏర్పాట్లు చేయాలని..చాలా ఖర్చు అవుతుందని అందుకే తన బదులు తన లాయర్ హాజరవుతారన్నారు. అంతగా కావాలనుకుంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా హాజరవుతానని పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ ను విచారణ జరిపిన కోర్టు.. మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది. సీబీఐ కూడా అలాంటి అవకాశం ఇవ్వొద్దని కౌంటర్ దాఖలు చేసింది.
జగన్ హైకోర్టుకు వెళ్తారా.. హాజరవుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది. హైకోర్టు గతంలో తనకు కింది కోర్టుకు హాజరవ్వాల్సిన పని లేదని ఆదేశాలు ఇచ్చిందని ఆయన లాయర్లు వాదిస్తున్నారు. హైకోర్టుకు వెళ్లడానికే ఇలా సమయం కోరారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం అయ్యాక ఆయన పూర్తిగా కోర్టుకు హాజరు కావడం మానేశారు. ఒక్క అక్రమాస్తుల కేసుకే కాదు.. తనే బాధితుడిగా ఉన్న కోడి కత్తి కేసుతో పాటు పాస్ పోర్టు రెన్యూవల్ కోసం కోర్టుకు హాజరు కావాలన్న ఉత్తర్వులు ఉన్నా హాజరు కాలేదు. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారన్నది చూడాల్సి ఉంది.

