హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెంటరీ పెరుగుతోంది. ముంబై తర్వాత దేశంలో అత్యధిక ఇన్వెంటరీ హైదరాబాద్‌లోనే ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. నిర్ధిష్ట కాలంలో మార్కెట్లో అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు లేదా అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లను ఇన్వెంటరీగా పరిగణిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు దేశంలోని ఏడు ప్రధాన మెట్రో నగరాల్లో ఆరు లక్షల వరకూ ఇన్వెంటరీ యూనిట్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ముంబైలో ఉండగా, రెండో స్థానంలో హైదరాబాద్ నిలిచింది. దాదాపుగా 95 వేలకు పైగా ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోదారుల కోసం ఎదురు చూస్తున్నాయి.
దేశంలో భవనాల ఎత్తుపై ఆంక్షలు లేని ఏకైక నగరం హైదరాబాదే. ఎఫ్ఎస్ఐపై ఆంక్షలు లేకపోవడంతో డెవలపర్లు పోటీపడుతూ హైరైజ్ ప్రాజెక్ట్‌లను చేపట్టారు. ఒక ఎకరం లేదా రెండు ఎకరాల స్థలంలోనే 2,000 నుంచి 3,000 అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. దీంతో డిమాండ్‌కు మించి సరఫరా వచ్చి, ప్రతికూల సమయంలో విక్రయాలు లేక అపార్ట్మెంట్లు ఖాళీగా ఉంటున్నాయి.
సగానికి పైగా అమ్ముడు కాని ఇళ్లు పశ్చిమ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, నార్సింగి, మణికొండ వంటి ప్రాంతాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి స్పష్టంగా కారణం అధిక తరలే. ఎగువ మధ్యతరగతి వర్గాలకు మాత్రమే ఆ ఇళ్లు అందుబాటులో ఉంటున్నాయి. వాటిని కొనేవారు తగ్గిపోతున్నారు. కానీ నిర్మించేవారు పెరిగిపోయారు. అందుకే ఇన్వెంటరీ పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే బిల్డర్లు భారీ ఆఫర్లు ప్రకటించి వదిలించుకుంటారు. త్వరలో ఈ పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం ఉండదు.


