టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్న సమయంలో వైసీపీ చేస్తున్న మరే ఇతర కార్యక్రమానికీ ప్రచారం రావడం లేదు. మెడికల్ కాలేజీలను పీపీపీలోకి మారుస్తున్నారని అంటే ప్రైవేటీకరణ చేయడమేనని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ రాజకీయాలు చేస్తున్న వైసీపీకి ఏదీ కలసి రావడం లేదు. కోటి సంతకాలు, ర్యాలీలు పేరుతో వారు చేస్తున్న హంగామా నవ్వుల పాలవుతోంది. 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి చాలా రోజులుగా నియోజకవర్గ ఇంచార్జులపై ఒత్తిడి పెంచారు. ఎంత భారీగా నిర్వహిస్తే అంత ప్లస్ అని మార్కులేస్తామన్నారు.
అయితే చాలా నియోజకవర్గాల్లో పట్టించుకున్నవారే లేరు. కొద్ది నియోజకవర్గాల్లో మాత్రం.. ఐదారు వందల మందిని పోగేసి ఫోటోలు, వీడియోలు తీయించుకుని మమ అనిపించారు. సాధారణంగా వైసీపీ ఏ కార్యక్రమం చేసినా సాక్షి సిస్టర్ మీడియా చానళ్లు.. ఉన్నవి, లేనివి కల్పించి ఎంతో కొంత ప్రచారం కల్పించేందుకు ప్రాధాన్యమిచ్చేవి.కానీ ఈ ర్యాలీల్ని అసలు పట్టించుకోలేదు. అసలు ర్యాలీలు జరిగాయన్న సంగతి కూడా చాలా మందికి తెలియనంత సింపుల్ గా జరిగిపోయాయి. కాలేజీలు ఉన్న వైసీపీ నేతలు విద్యార్థుల్ని రోడ్ల మీదకు తీసుకు వచ్చారు.
కోటి సంతకాల పేరుతో చేస్తున్న డ్రామా కూడా నవ్వుల పాలవుతోంది. హైదరాబాద్ లోనూ సంతకాలు సేకరింస్తూ అదో గొప్ప అని ప్రకటనలు చేసుకుంటున్నారు. దొంగ సంతకాలతో ఆ కోటిని రామకోటిలా రాసి.. గవర్నర్ కు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. ర్యాలీలు మ..మ అనిపించారు కాబట్టి ఈ సంతకాల కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి.. గవర్నర్ కు ఇవ్వనున్నారు. వైసీపీ చేపడుతున్న ఏ ఒక్క పని కూడా.. నిజాయితీగా చేస్తున్నదని ప్రజలు అనుకునేలా చేయలేకపోతున్నారు.


