జూబ్లిహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీ ఒకటే గగ్గోలు పెడుతోంది. దొంగ ఓట్లు , రిగ్గింగ్ తో ప్రజాస్వామ్యాన్ని పాతకం పెట్టారని ఆరోపిస్తోంది. దాడులు, దౌర్జన్యాలు చేశారని సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది. అసలు ఎన్నికలను రద్దు చేయాలని అభ్యర్థి మాగంటి సునీత డిమాండ్ చేయడంతో బీఆర్ఎస్ క్యాడర్ పూర్తిగా డీలా పడిపోయింది. కేకే లాంటి సర్వేలు చూసి ఎంతో నమ్మకం పెట్టుకున్న వారు కూడా.. పెద్దల వైపు నుంచి వచ్చిన స్పందన చూసి జావకారిపోయారు. అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోతున్నారు. బీఆర్ఎస్ క్యాడర్ ఆత్మవిశ్వాసాన్ని తమ …అక్రమాల స్ట్రాటజీతో దెబ్బకొట్టేసుకుంటున్నారు.
బీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చిందన్నది నిజం
జూబ్లిహిల్స్ లో ఏకపక్షంగా పోలింగ్ జరగలేదు. ఆ విషయం అందరూ చెబుతున్నారు. భారత రాష్ట్ర సమితి గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ వెనక్కి తగ్గడం కలసి వచ్చింది. ఆ పార్టీ రేసులో లేకపోవడం వల్ల ఓటర్లు ద్విముఖ పోటీగానే చూశారు. గతంలో జూబ్లిహిల్స్ లో ఎప్పుడూ ముఖాముఖి పోరు సాగలేదు. మొదటి నలుగురు, ఐదుగురు అభ్యర్థులు గట్టిగా పోరాడేవారు. వారిలో నవీన్ యాదవ్ కూడా ఉండేవారు. ఇప్పుడు మాత్రమే ద్విముఖ పోటీ జరిగింది. అందుకే.. బీఆర్ఎస్ పార్టీ ముందుగానే వదిలేసి.. ఓడిపోయామని తీర్మానించుకోలేరు. ఓడినా.. గెలిచినా మార్జిన్ చాలా తక్కువ అన్నది ఎక్కువ చెబుతున్నమాట.
గెలుపు మార్జిన్ చాలా తక్కువ – కాడి దించేయడం ఎందుకు?
పెద్దపెద్ద ఎగ్జిట్ పోల్స్ అన్నీ పోరు హోరాహోరీగా ఉందని చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో స్ట్రాటజీని చాలా క్లిష్టంగా ఉంచుకోవాలి. కౌంటింగ్ వద్ద తమ ఏజెంట్లు ఉండేలా చూసుకోవాలంటే.. తాము రేసులో ఉన్నామని అనుకునేలా చేయాలి. కానీ పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి .. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, నేతలు చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ఆరోపణలతో.. జూబ్లిహిల్స్ పోయిందన్న అభిప్రాయానికి క్యాడర్ వచ్చేస్తున్నారు. కొంత మంది బీజేపీతో పొత్తు తప్పదేమో అని బాధపడుతున్నారు. అసలు ఫలితం రాక ముందే ఇలాంటి పరిస్థితి తీసుకు వచ్చేశారంటే.. ఇక ఫలితాలు నిజంగానే తేడా వస్తే ఇలాంటి క్యాడర్ ఆత్మస్థైర్యం ఏమైపోతుంది?
బీఆర్ఎస్ రియాలిటీలోకి రావాలి !
భారత రాష్ట్ర సమితి పూర్తిగా సోషల్ మీడియాను నమ్ముకుంది. సోషల్ మీడియా చాలా ముఖ్యమే కానీ.. అదొక్కటే పని చేయదు. ఆ పనులు చేసేవాళ్లే కార్యకర్తలు కాదు. అంతకు మంచిన రాజకీయం ఉంటుంది. అదే సమయంలో ప్రతీ దానికి వెంటనే తీర్పులు ఇచ్చేసుకుని కిందామీదా పడటం మానేయాలి. చాలా వరకూ రాజకీయాల్లో సమస్యలు కాలమే పరిష్కరిస్తుంది. ప్రతీ దానికి భావోద్వేగానికి గురవుతూంటే.. అదీ కూడా నాయకత్వం క్యాడర్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకత్వం ముందుగా తమ క్యాడర్ కు ధైర్యం చెప్పాలి.. లేకపోతే.. బీఆర్ఎస్ పను సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.


