బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ ఏపీలో లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. నారా లోకేష్ నిన్న ఇచ్చిన టీజర్‌కు అసలు విషయం వెల్లడించారు. బ్రూక్ ఫీల్డ్ అంతర్జాతీయంగా పేరు గాంచిన ఫండ్. పునర్వినియోగ శక్తి, బ్యాటరీ & పంప్ స్టోరేజ్, సోలార్ తయారీ , ఇతర డీకార్బనైజేషన్ ప్రాజెక్టులలో 12 బిలియన్ డాలర్లు అంటే లక్షా పది వేల కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టనుంది.
అంతేకాకుండా బ్రూక్‌ఫీల్డ్ డేటా సెంటర్లు, కమర్షియల్ రియల్ ఎస్టేట్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (GCC), మౌలిక సదుపాయాలు, ఓడరేవులు వంటి విభిన్న రంగాల్లోనూ పెట్టుబడులు పెడుతుంది. ఈ అతిపెద్ద పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుస్థిర , ఆకర్షణీయమైన పెట్టుబడులకు ప్రముఖ గమ్యస్థానంగా మరింత బలోపేతం చేస్తుందని నారా లోకేష్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థల్లో బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ ఒకటి . ఇది కెనడా కేంద్రంగా ఉంటుంది. ఒకే సంస్థ నుంచి ఒకే రాష్ట్రంలో వచ్చిన అతిపెద్ద FDIలలో ఇది ఒకటిగా నిలుస్తుంది. వేలాది మందికి ప్రత్యక్ష , పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే 10 GWకి పైగా సోలార్-విండ్ ప్రాజెక్టులు ఉన్న ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా మారనుంది. విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో హైపర్‌స్కేల్ డేటా సెంటర్లకు బ్రూక్‌ఫీల్డ్ ఆసక్తి చూపడం రాష్ట్ర డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మరింత బలోపేతం చేస్తుంది.
గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా పెద్ద గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షిస్తూ టాప్-5 రాష్ట్రాల్లోకి చేరుకుంది. ఈ పెట్టుబడి కేవలం ఆర్థిక ఒప్పందం మాత్రమే కాదు – ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు “సుస్థిర భవిష్యత్తు రాష్ట్రం”గా మార్చే టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.


