“పరిస్థితులు బాగోలేవు కాబట్టి ఇలా ఉన్నాం కానీ.. అసలు క్యారెక్టర్ లోపల అలాగే ఉంది” అని ఓ టీవీ చానల్ ఎప్పటికప్పడు నిరూపిస్తూనే ఉంటుంది. జూబ్లిహిల్స్ ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం పెట్టినప్పుడు.. మూడో రౌండ్ ఫలితాలపై ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చిన అంశంపై స్పందించారు. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ కు భారీ మెజార్టీ వచ్చిందని ఇక ఆ పార్టీ హవా ప్రారంభమైందని ఆ చానల్ బ్రేకింగులు వేసింది.
నిజానికి మూడో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది. ఆ చానల్ అలా తప్పుడు ప్రచారం చేసే సరికి ఇతర మీడియా చానళ్లు కూడా అదే పని చేశాయి. కానీ పోస్టర్ బ్యాలెట్ సహా ఏ ఒక్క రౌండ్ లోనూ.. బీఆర్ఎస్ పార్టీ లీడ్లోకి రాలేదు. మరి ఎందుకు ఆ చానల్ ఇలా తప్పుడు ప్రచారం చేసిందంటే.. అలా ఫలితాలు రావాలని ఆ చానల్ కోరుకుంది. ఆ చానల్ తనను తాను నియంత్రించుకుని ఉంటోంది కానీ.. కాంగ్రెస్ పార్టీ మీద.. రేవంత్ రెడ్డి మీద బండలు వేసే అవకాశం వస్తే.. విశ్వరూపం చూపించడానికి రెడీగా ఉంటుంది.
ఓ మీడియా ప్రొఫెషనల్ చేతుల్లో నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఆ మీడియా చానల్ పూర్తి స్థాయి పొలిటికల్ , బ్లాక్ మెయిల్ టూల్ గా మారిపోయింది. వారి తీరును ఎత్తి చూపుతూ ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై తన దాడి చేయడానికి ఏ మాత్రం వెనుకాడదు. ఏపీలో జగన్.. తెలంగాణ లో బీఆర్ఎస్ పార్టీకి కాలులో ముల్లు గుచ్చుకుంటే నోటితో తీసేందుకు ఆ చానల్ పెద్దలు తహతహలాడిపోతుంటారు. రాజకీయంగా ప్రజా సమస్యలను ప్రశ్నించలేరు కానీ.. అధికార పార్టీలలో లుకలుకలు అని.. లేనిపోని లీడర్లకు ఎలివేషన్లు ఇచ్చి.. ఆయా పార్టీల్లో చిచ్చు పెట్టేందుకు కథనాలు రాస్తూంటారు.
కారణం ఏదైనా.. ఆ చానల్ విషయంలో ప్రభుత్వాలు చాలా ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నాయి. మీడియాగా ఆ చానల్ వ్యవహిరంచకుండా.. రెండు ప్రభుత్వాలను నడుపుతున్న అధికార పార్టీలపై వారు చిమ్మిన విషం గురించి గుర్తున్నా సరే..ఇంకా పద్దతిగానే వ్యవహరిస్తున్నారు. అదే ఆ చానల్ కు అలుసైపోయినట్లుగా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి విన్యాసాలు ఆ చానల్ నుంచి చాలా చూడాల్సి రావొచ్చు.


