తన సినిమాని ప్రమోట్ చేసుకోవడంలో రాజమౌళి తరవాతే ఎవరైనా. పైసా ఖర్చు లేకుండానే కోట్లకు సరిపడా పబ్లిసిటీ తెచ్చుకోగలడు. తెలుగు సినిమాని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మార్చి, గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లగలడు. తెలుగు సినిమాకు ఆస్కార్ గౌరవం దక్కిందంటే… తన కష్టంతో పాటు, పబ్లిసిటీ ఎత్తుగడలు కూడా బాగా బలంగా పని చేశాయి. తన వ్యూహాలు అస్సలు అంతు పట్టవు. తన ఎత్తులు ఊహించలేం. తాజాగా ‘వారణాసి’ విషయంలోనూ తన పబ్లిసిటీ ప్లానింగ్ చాలా భిన్నంగా కనిపిస్తోంది.
2027లో విడుదల కావాల్సిన సినిమా ఇది. రెండేళ్లకు ముందే ప్రమోషన్లు మొదలెట్టేశాడు రాజమౌళి. నిజానికి అభిమానులు ‘అప్ డేట్.. అప్ డేట్’ అంటూ గింజుకొన్నా పట్టించుకోని రాజమౌళి.. ఈనెలలో అప్ డేట్ల మీద.. అప్ డేట్లు ఇచ్చుకొంటూ వెళ్లాడు. ఓ గ్లింప్స్ విడుదల చేశాడు. అంతేకాదు.. హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేశాడు. రెండేళ్ల తరవాత వచ్చే సినిమాకు ఇంత ముందు నుంచే ఎందుకు హడావుడి అనేది ఎవ్వరికీ అంతు పట్టడం లేదు. అక్కడే మరి రాజమౌళి మార్క్ స్ట్రాటజీ కనిపించేది.
ఈ సినిమాతో తన గళాన్ని గ్లోబల్ స్థాయిలో వినిపించడానికి రాజమౌళి రెడీ అయ్యాడు. హాలీవుడ్ లోనూ తన సినిమా గురించి మాట్లాడుకోవాలంటే… ఇప్పటి నుంచే హడావుడి చేయాల్సిందే. తెలుగులో ఓ భారీ ప్రయత్నం జరుగుతోంది.. ఆ సినిమా హాలీవుడ్ కి రాబోతోందన్న సంకేతాలు ఇప్పటి నుంచే పంపాలి. హాలీవుడ్ జర్నలిస్టుల్ని పిలిచి… తన ఈవెంట్ చూపించడానికి కారణం అదే. ఈ జనసందోహం, ఇక్కడి హడావుడి.. అక్కడి మీడియా కంట పడాలి. సినిమాని ఇక్కడి ప్రజలు ఎంత ఆదరిస్తారో వాళ్లకు అర్థం కావాలి. రాజమౌళి అదే చేశాడిప్పుడు.
మహేష్ బాబు సినిమా కథేమిటి, అందులో మహేష్ పాత్ర ఎలా ఉండబోతోంది? అనే విషయంలో చాలా చర్చ సాగింది. `వారణాసి` టైటిల్ గ్లింప్స్ రాకపోతే.. ఆ చర్చ అలా సాగుతూనే ఉండేది. ఒక్కసారి గ్లింప్స్ బయటకు రాగానే.. ఈ సినిమా వరల్డ్ ఎలా ఉండబోతోందో, రాజమౌళి ఉద్దేశ్యాలేమిటో అందరికీ అర్థమైపోయాయి. ఇప్పుడు ప్రేక్షకుడు రాజమౌళి ఏం చెప్పబోతున్నాడనే విషయంలో ఓ స్పష్టత తెచ్చుకొన్నాడు. అంటే ఆడిటోరియాన్ని ముందే సిద్ధం చేయడం అన్నమాట. అప్పుడే తన వర్క్ మరింత ఈజీ అవుతుంది. ఏవేవో ఊహించుకొని ప్రేక్షకులు థియేటర్లకు రావడం, ఆ తరవాత నిరాశ పడడం రాజమౌళికి నచ్చదు. అందుకే ప్రేక్షకుల మనసుల్ని ముందే ట్యూన్ చేస్తాడు. తన సినిమా కథేమిటన్న విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం వెనుక కారణం ఇదే. మహేష్ సినిమా విషయంలో అది సాధ్యం కాలేదు. ఒక్క ముక్కలో తన కథేమిటన్నది చెప్పడం కుదర్లేదు. అందుకే గ్లింప్స్ విడుదల చేశాడు. అయితే దాన్ని కూడా మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా వాడుకొన్నాడు. ప్రసార హక్కుల్ని జియో హాట్ స్టార్‌కి అమ్మేసి… కొంత సొమ్ము వెనక్కి రాబట్టగలిగాడు.
గ్లింప్స్ విషయంలో రాజమౌళి మరో తెలివైన పని చేశాడు. తను ఇప్పటి వరకూ షూట్ చేసిన సన్నివేశాల్లో ఒక్క ఫ్రేమ్ కూడా చూపించలేదు. ఈ గ్లింప్స్ కోసం ప్రత్యేకంగా షూట్ చేసిన షాట్లే వాడాడు. గ్లింప్స్ చివర్లో చూపించిన షాట్ కూడా సినిమాలో ఉండకపోవొచ్చు. ఆ విధంగా సినిమాలోని షాట్ ఏదీ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇలా… ఎలా చూసినా రాజమౌళి పక్కాగా ఓ స్ట్రాటజీ ఫాలో అయ్యాడన్నది అర్థం అవుతోంది. ఈ గ్లింప్స్ తో చాలా సందేహాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన సినిమాతో ఇచ్చే సౌండ్ ఎంత గట్టిగా ఉండబోతోందో శాంపిల్ చూపించాడు. అంతేకాదు… అభిమానులంతా శాంతించేలా చేశాడు. మరో ఆరు నెలల వరకూ `అప్ డేట్` అడక్కుండా.. కరువు తీరేలా, కడుపు నిండేలా.. తృప్తిగా ఓ ఈవెంట్ చేసి, అభిమానుల మనసుల్ని కూడా గెలుచుకొన్నాడు. అందుకే అనేది… రాజమౌళిది మాస్టర్ మైండ్ అని.