ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ముద్ర చట్టబద్ధంగా వేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాజధాని అమరావతిని అధికారికంగా ధృవీకరించే గెజిట్ బిల్లు డిసెంబర్ పార్లమెంట్ సెషన్లో ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన, పరిపాలనా చర్యలను ఈ బిల్లు కోసం రెడీ చేస్తోంది. నిజానికి దేశంలో ఏ రాష్ట్రానికి ఇప్పటి వరకూ అధికారిక రాజధాని గెజిట్ లేదు. కానీ ఏపీలో ఉన్న దౌర్భాగ్యమైన రాజకీయాలు, రాజధానికి భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడటానికి కేంద్రంతో మాట్లాడి ఏపీ ప్రభుత్వం గెజిట్ తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.
ప్రజలు ఇచ్చిన బలంతో చంద్రబాబు ముందుకు
గతంలో అమరావతిని అసెంబ్లీలో అంగీకరించి .. మళ్లీ తాను గెలిచిన తరవాత నాలుక మడతేసి మూడు రాజధానుల నాటకం అడిన జగన్ రెడ్డి దెబ్బకు అమరావతికి అనేక సమస్యలు వచ్చాయి. ‘మూడు రాజధానులు’ విధానం వల్ల ఏర్పడిన చట్టపరమైన సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. ఎంత పరిష్కరించినా ఎవో సమస్యలు ఉంటూనే ఉన్నాయి. పెట్టుబడిదారులు కూడా.. అమరావతి రాజధాని ఎవరూ మార్చలేరన్న గ్యారంటీ ఏమిటన్న ప్రశ్నలు అక్కడక్కడా వినిపిస్తున్నారు. అందుకే కేంద్రంలో ఉన్న పలుకుబడితో అమరావతికి గెజిట్ తీసుకురావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో కీలకంగా వ్యవహరించే బలం ప్రజలివ్వడంతోనే ఇది సాధ్యం అయింది.
పార్లమెంట్ బిల్లు ద్వారా గెజిట్
అమరావతి అభివృద్ధి ప్రక్రియలో గెజిట్ ప్రచురణ కీలకం కానుంది. 2014లో CRDA ఏర్పాటు చేసిన తర్వాత, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రతిపాదించారు. కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం ‘మూడు రాజధానులు’ విధానాన్ని ప్రవేశపెట్టి, CRDAను అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియా గా మార్చింది. కానీ చట్టపరంగా నిలబడలేదు. అందుకే మరోసారి అలాంటి సమస్యలు రాకుండా గెజిట్ ప్రచురించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఇన్వెస్టర్లు కోరుతున్నారు. గెజిట్ ప్రచురణతో రాజధానిని ఇక ఎవరూ మార్చలేరని పెట్టుబడిదారులు నమ్మకం పెంచుకుంటే పెట్టుబడులు పెరుగుతాయి. నగరం వేగంగా విస్తరిస్తుంది.
కేంద్రం సహకారం ఖాయమే
గెజిట్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం కేంద్ర సహకారంపై ఆధారపడి ఉంది. 2020లో మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిన హైకోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు పెండింగ్ కేసులు ఇంకా పరిష్కారం కాకపోవడంతో, ఈ చర్యలు రాజకీయంగా సున్నితమైనవిగా మారుతాయి. కానీ చట్టం చేయడానికి కేసులు అడ్డంకి కావని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో గెజిట్ తీసుకు వచ్చేందుకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా న్యాయనిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి.. డిసెంబర్ లో గెజిట్ ను పార్లమెంట్ ను ఆమోదింపచేసేందుకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేసింది.
అమరావతి గెజిట్ అంశం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. మొదటి ఐదేళ్లు గెజిట్ తీసుకురాలేదని గోల చేశారు. ఏ రాష్ట్రానికి గెజిట్ ఉండదు. అ గెజిట్ లేకపోవడం వల్లే జగన్ మూడు రాజధానులు అన్నారని..గెజిట్ ఉంటే మార్చేవారు కాదని చెప్పుకొచ్చారు. మార్చే అవకాశం ఇక ప్రజలు ఇవ్వకపోయినా రైతులు, పెట్టుబడిదారుల నమ్మకం కోసం చంద్రబాబు గెజిట్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.


