Premante movie review
తెలుగు360 రేటింగ్: 2.25/5
పెళ్లైన కొత్తలో తరహా కథలు చాలా వచ్చాయి. పెళ్లి ముందు కేవలం పరిచయం, ప్రేమ మాత్రమే ఉండే జంటలు.. కలిసి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఒకరినొకరు పూర్తిగా తెలుసుకున్నాక వచ్చే మార్పులు చూపించిన సినిమాలు చాలా ఉన్నాయి. ప్రియదర్శి ‘ప్రేమంటే’తో అలాంటి ఓ ప్రయత్నం చేశాడు. మరి ప్రయత్నంలో ఎలాంటి కొత్తగా ఉంది? ఈ భార్యభర్తలు పంచిన వినోదం హత్తుకుందా? మిత్ర మండలి డిజాస్టర్ తర్వాత దర్శికి కంబ్యాక్ దొరికిందా?
మధుసూదన్ అలియాస్ మది (ప్రియదర్శి), రమ్య (ఆనంది) ఓ పెళ్లిలో కలుసుకుంటారు. ప్రేమ, పెళ్లిపై వాళ్ల అభిప్రాయాలు కలుస్తాయి. ఇంట్లో పెద్దలు కూడా వీళ్లకి పెళ్లి చేయాలని చూస్తుంటారు. ఎలాంటి ఆటంకం లేకుండా పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ ఓ ఇంటికి షిఫ్ట్ అవుతారు. నెల రోజుల పాటు హాయిగా గడిపేస్తారు. తర్వాత మదిపై రమ్యకి ఎక్కడో చిన్న అనుమానం మొదలవుతుంది. తనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడని పసిగడుతుంది. గట్టిగా నిలదీస్తే తానే ఓ దొంగనే అసలు నిజం చెబుతాడు మది. ఆ నిజం తెలుసుకున్నాక రమ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఈ నిర్ణయంతో ఈ జంట ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగతా కథ.
కొత్త దర్శకులు కొత్తగా ఆలోచించాలంటే.. బేసిక్స్‌ని వదిలేయమని కాదు. ప్రేమ, పెళ్లి, కలిసి ఉండటం లాంటి హ్యూమన్ ఎమోషన్స్ చెప్పే కథకి సంబంధించిన సినిమా ట్రైలర్‌ను సస్పెన్స్ థ్రిల్లర్‌లా కట్ చేస్తే ఆడియన్స్‌ని మిస్లీడ్ చేసినట్లవుతుంది. ‘ప్రేమంటే’ సినిమాకి కూడా ఇదే జరిగింది. ‘ప్రేమంటే’ అనే ఓ సాఫ్ట్ టైటిల్ పెట్టి, ట్రైలర్‌తో ఆడియన్స్‌ని ఏ మాత్రం ప్రిపేర్ చేయకుండా బంటీ బబ్లీ, భలే దొంగలు, దొంగ పోలీస్ తరహాలో ఓ కాన్ కథ చూపించారు. పోనీ అదేమైనా థ్రిల్ అయ్యిపోయిఅంత సర్ప్రైజ్ చేసిందా అంటే అదీ లేదు. పోనీ పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనైనా కలిసి ఉండాలని నిర్ణయించుకున్న ఓ జంట కథగా చూసినా ఇందులో ఎమోషన్ ఆడియన్స్‌కు పట్టదు. కామెడీ అనుకున్న డ్రామా తేలిపోయింది.
ఓ పెళ్లిలో మది–రమ్య కలుసుకోవడం, లాకర్ సీన్, అక్కడే పెళ్లి చూపుల వరకూ దర్శకుడు కాస్త కొత్తగానే ట్రీట్ చేశాడు. తన భర్త ఓ దొంగని తెలుసుకోవడంతో ఈ కథలో అసలు సంఘర్షణ మొదలవుతుంది. కానీ ఆ కాన్ఫ్లిక్ట్ని నడిపించడంలో దర్శకుడి అనుభవరాహిత్యం కనిపించింది. ఇంటర్వెల్ కోసం ఓ రాబరీ సీన్ ప్లాన్ చేశారు. కానీ ఆ తంతు నడిపిన విధానం చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. నిజానికి ఇందులో హీరో క్యారెక్టరైజేషన్‌ని దొంగగా చేయడానికి ఆడియన్స్‌ను కన్విన్స్ చేసే కారణాలు ఇవ్వలేదు. అదే బలహీనంగా ఉన్నప్పుడే సెకండ్ హాఫ్‌లో హీరోయిన్ కూడా జాయిన్ అయిపోతుంది. ఆ డ్రామా ఎంతమాత్రం రక్తికట్టలేదు. మరోవైపు హెడ్ కానిస్టేబుల్ ఆశా మేరి క్యారెక్టర్లో సుమ విచారణ ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది. ఆ ట్రాక్ మొత్తం మిస్‌ఫైర్ అయ్యింది.
ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలూ ఉన్నాయి. కథ కథనాలు బలహీనంగా ఉన్నప్పటికీ ప్రియదర్శి–ఆనంది జోడీ బాగా కుదిరింది. సహజసిద్ధమైన నటనతో కొంత ఎమోషన్ యాడ్ చేయడానికి ప్రయత్నించారు. సుమ క్యారెక్టర్ బలంగా రాయాల్సింది. పాత్రలో ఉన్న బలహీనత వలన ఆమె నటన కూడా అంతగా అతకలేదు. వెన్నెల కిషోర్‌ని సరిగ్గా వాడుకోలేకపోయారు. హైపర్ ఆది, ఆటో రాం ప్రసాద్ పంచులు తేలిపోయాయి. టెక్నికల్ వర్క్ బావుంది. విజువల్స్, లియోన్ జేమ్స్ పాటలు, నేపథ్య సంగీతం డీసెంట్‌గా కుదిరింది.
కొత్త దర్శకుడు నవనీత్ శ్రీరామ్ థియేటర్స్‌లో ఆడియన్స్ ఫుల్‌గా థ్రిల్ చేసేయాలని ట్రైలర్లో అసలు కథ గురించి ఎలాంటి హింట్ ఇవ్వలేదు. పైగా పెళ్లి ప్రేమ విడాకులని మిస్ లీడ్ చేశాడు. ఇది మేలు కంటే కీడే చేసింది. హీరో క్యారెక్టర్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఆడియన్స్‌కి చాలా సమయం పట్టింది. తోడు దొంగలా హీరోయిన్ కూడా చేరింది. ప్రేమ, పెళ్లి, విడాకులు అని ట్రైలర్లో చాటి చెప్పి బంటీ బబ్లీ కథని చూపించిన తీరులో సహజత్వం, భావోద్వేగం రెండూ కొరవడ్డాయి.
తెలుగు360 రేటింగ్: 2.25/5