రాజకీయాల్లో ఆరోపణలు కాస్తంత అయినా నమ్మశక్యంగా ఉంటే ప్రజలు ఆలోచిస్తారు. లేకపోతే నవ్వుకుంటారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలా నవ్వుకునే ఆరోపణలే చేస్తున్నారు. కొత్తగా ఐదు లక్షలకోట్ల స్కాం రేవంత్ రెడ్డి చేస్తున్నాడని ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపించారు. ఆ స్కాం ఏమిటంటే దశాబ్దాలుగా పారిశ్రామిక సంస్థలకు లీజులు ఇచ్చిన భూములు..లీజుల గడవు ముగిస్తే.. వాటిని క్రమబద్దీకరించుకునేందుకు అవకాశం ఇస్తూ.. ఓ స్కీమ్‌ను కేబినెట్ లో ప్రతిపాదించారు.
నలభై, ఏళ్ల కిందట పారిశ్రామిక సంస్థల్ని ప్రోత్సహించడానికి ఈ భూముల్ని లీజు పద్దతిలో కేటాయించారు. ఆ భూముల్లో ఇప్పటికీ పరిశ్రమలు నడుస్తున్నాయి. అందుకే వాటిని క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత కాలం పారిశ్రామిక వాడలుఅయిన బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, అజామాబాద్‌తో సహా పారిశ్రామిక క్లస్టర్లలో ఈ భూములు ఉన్నాయి. మార్కెట్ విలువలో 30 శాతం కట్టించుకుని క్రమబద్ధీకరించాలని రేవంత్ ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది.
ఇదే పెద్ద స్కాం అని కేటీఆర్ అంటున్నారు. ఈ భూముల మార్కెట్ విలువ ప్రస్తుతం ఎకరాకు రూ. 40 నుంచి 50 కోట్ల వరకు ఉందని, దీని మొత్తం విలువ రూ. 4 లక్షల కోట్ల నుంచి రూ. 5 లక్షల కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. ఆ భూములను రేవంత్ కేవలం ప్రభుత్వ విలువలో 30% కే అప్పగించాలని చూస్తున్నారని ఆయన ఆరోపణ. లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తాయని ఆయన అంటున్నారు.
నిజానికి ఆయా సంస్థలు ఇప్పటికిప్పుడు భూములు ఖాళీ చేయమన్నా చేయవు. ఎందుకంటే అక్కడ పరిశ్రమలు నడుస్తున్నాయి. వాటికి లీజు ఒప్పందం కొనసాగించాల్సిందే. మూతపడిపోయిన సంస్థల నుంచి భూములు వెనక్కి తీసుకోవచ్చు. కానీ నడుస్తున్న కంపెనీల నుంచి భూములు వెనక్కి తీసుకుని వేలం వేయాలంటున్నారు. లేకపోతే ఐదు లక్షల కోట్ల స్కాం చేసినట్లు అంటున్నారు. తాము చేస్తే నిజాయితీ. కాంగ్రెస్ చేస్తే అవినీతి అన్నట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు.