నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం చిత్రాలతో క్లాస్ దర్శకుడిగా పేరు సంపాదించుకొన్నాడు వేణు ఉడుగుల. విరాట పర్వం విడుదలై అప్పుడే మూడేళ్లు దాటిపోయింది. ఆ తరవాత వేణు చేసే సినిమా ఏమిటన్న విషయంలో స్పష్టత రాలేదు. వెంకటేష్ తో ఓ సినిమా దాదాపు ఖాయమైందని వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు కదల్లేదు. ఇప్పుడు ఓ మల్టీస్టారర్ చేయడానికి రంగం సిద్ధం చేసుకొన్నాడని టాక్.
పెద్దింటి అశోక్ కుమార్ రాసిన ఓ నవలని ఆధారంగా చేసుకొని వేణు ఓ కథ రాసుకొన్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. దానికి ఇద్దరు హీరోలు కావాలి. ఓ పెద్ద హీరో, మరో యువ హీరో. ఇక్కడి టాప్ హీరోకి కథ చెప్పాడు. ఆ హీరోకి నచ్చింది. కానీ చివరి క్షణంలో డ్రాప్ అయ్యాడు. దాంతో ఈకథని మోహన్ లాల్ దగ్గరకు తీసుకెళ్దామనుకొంటున్నారు. యువ హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ దాదాపు ఫిక్సయ్యాడు. అన్నీ కుదిరితే.. మోహన్ లాల్, రోషన్ కాంబోలో ఈ సినిమా వస్తుంది. ప్రస్తుతం వేణు ఉడుగుల ఈ స్క్రిప్టు పనుల్లోనే బిజీగా ఉన్నాడు. ఈవారం విడుదలైన `రాజు వెడ్స్ రాంబాయి` చిత్రానికి షోరన్నర్‌గా వ్యవహరించాడు వేణు. ఈ చిత్రంతో తన శిష్యుడ్ని దర్శకుడిగా పరిచయం చేశాడు. ఈటీవీ విన్ లోనే మరో సినిమా చేస్తున్నాడని, ఈ సినిమాకీ ఆయన షో రన్నర్‌గా ఉంటారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.