‘విరూపాక్ష’ సినిమాతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకొన్నాడు కార్తీక్ దండు. ఆ తరవాత తనకు చాలా ఆఫర్లు వచ్చాయి. చివరికి నాగచైతన్యతో సినిమా ఓకే అయ్యింది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ కథపై, ప్రాజెక్ట్ పై నాగచైతన్య చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఈ రోజు చైతూ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ ని రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘వృషకర్మ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. చైతూ గెటప్ మాసీగా ఉంది. రా అండ్ రస్టిక్ అవతార్‌లో కనిపిస్తున్నాడు. తన హెయిర్ స్టైల్ కూడా కొత్తగా అనిపిస్తోంది.
నాగచైతన్య చిత్రానికి ‘వృషకర్మ’ అనే టైటిల్ పెడతారంటూ తెలుగు 360 ముందే చెప్పింది. ఆ తరవాత ఇదే పేరు ప్రచారంలోకి వచ్చింది. చివరికి ఆ టైటిలే.. చిత్రబృందం ఫిక్స్ చేసింది. ‘వృష కర్మ’ అంటే ధర్మబద్ధమైన పనులు చేసేవాడు, నీతిమంతుడు అని అర్థం. ట్రెజర్ హంట్ కి సంబంధించిన కథ ఇది. పిరియాడిక్ టచ్ కూడా ఉండబోతోంది. ‘విరూపాక్ష’లా ఈ చిత్రానికి సంస్కృత పదంతోనే టైటిల్ పెట్టాలని కార్తీక్ దండు ముందు నుంచీ కృతనిశ్చయంతో ఉన్నాడు. ఈకథకు, హీరో క్యారెక్టరైజేషన్‌కు ‘వృష కర్మ’ అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని చిత్రబృందం భావించింది. చైతూ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇది. ఇందుకోసం భారీ సెట్లు తీర్చిదిద్దారు. హైదరాబాద్‌లో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ గుహ సెట్ వేశారు. అక్కడ కొంత మేర షూటింగ్ జరిగింది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు.