‘రాజాసాబ్’ నుంచి ఎలాంటి అప్ డేట్ వచ్చినా… ఫ్యాన్స్ పండగ చేసుకొంటున్నారు. ప్రభాస్ రేంజ్ అలాంటిది. ఇప్పటికే.. టీజర్, ట్రైలర్ వదిలేసింది చిత్రబృందం. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కూడా బయటకు వచ్చింది. ‘రెబల్ సాబ్’ అంటూ సాగే ఈ పాటని కలర్ ఫుల్ గా డిజైన్ చేశాడు మారుతి. ప్రభాస్‌ని రంగు రంగుల చొక్కాల్లో చూపించాడు. స్టెప్పులు వేయించాడు. ప్రభాస్ ని ఇలా చూసి ఎన్నాళ్లో అయ్యింది. ఆ గెటప్, లుక్, స్టైల్ అంతా కొత్తగా అనిపించింది. వింటేజ్ ప్రభాస్ ని చూస్తున్నాం.. అని ఫ్యాన్స్ కూడా మురిసిపోయారు. ‘పాన్ ఇండియా నెంబర్ వన్ బ్యాచిలర్’ అంటూ తనకు తానే ఓ ట్యాగ్ లైన్ ఇచ్చుకోవడం కూడా బాగుంది.
కాకపోతే… తమన్ ఇచ్చిన సౌండింగ్ ఒక్కటే సరిపోలేదనిపిస్తోంది. తమన్ ఈమధ్య మంచి ఫామ్ లో ఉన్నాడు. తన సౌండింగ్ కొత్తగా ఉంటోంది. ఓజీ, తెలుసుకదా సినిమాలకు మంచి పాటలు ఇచ్చాడు. రాజాసాబ్‌కు సైతం.. అదిరిపోయే బాణీలు ఇస్తాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు. కానీ తమన్ ఆ అంచనాల్ని అందుకోలేకపోయాడు. ఈమధ్య ‘చికిరి’ పాట ప్రభంజనం సృష్టించింది. అంతకు ముందు వచ్చిన ‘మీసాల పిల్ల’ పాట కూడా యూ ట్యూబ్ ని షేక్ చేసింది. ఈ రెండు పాటల మధ్య ‘రెబల్ సాబ్’ కనిపించడం కష్టమే. ఫ్యాన్స్ లోకి ఒక్కసారిగా దూసుకుపోయే పాట కాదిది. ట్యూన్ కూడా అంత క్యాచీగా లేదు. పాటలో సాహిత్యం కూడా చెవులకు ఇంపుగా వినిపించడం లేదు. ఏరకంగా చూసినా… అంచనాల్ని అందుకోలేదు.
‘రాజాసాబ్’ సంగీత ప్రయాణం ఎప్పుడో మూడేళ్ల క్రితం మొదలైంది. బహుశా.. తమన్ అప్పుడు చేసిన ట్యూన్ లా ఉంది. అందుకే ఇప్పటికి పాతబడిపోయింది. ఫస్ట్ సింగిల్ తో తమన్ నిరుత్సాహపరిచాడు. రాబోయే పాటల్లో అయినా జోష్ కనిపిస్తే… ప్రభాస్ ఫ్యాన్స్ కు అదే పది వేలు.
