పూరి జగన్నాథ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’, ‘లైగర్’ సినిమాలు ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టాయి. దాంతో ఇప్పుడు హిట్ కొట్టక తప్పని పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ వేసవిలో విడుదల చేస్తారు. ఆ తరవాతి సినిమా కూడా దాదాపుగా ఫిక్సయిపోయింది. పూరి మళ్లీ ఓ తమిళ హీరోతోనే సినిమా చేస్తారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు సూర్య పేరు బయటకు వచ్చింది. సూర్య – పూరి కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అని చెబుతున్నారంతా.
ఇటీవలే సూర్యతో పూరి భేటీ వేశారని, కథల విషయంపై చర్చ నడిచిందని తెలుస్తోంది. సూర్య కూడా పూరికి అభిమానే. ఆయనతో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. మహేష్ బాబుతో చేసిన ‘బిజినెస్ మాన్’ కథ ముందుగా సూర్య దగ్గరకే వెళ్లింది. ఆయన కూడా ఓకే అన్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ముందుకు వెళ్లలేదు. ఈ సినిమాలో హీరో పేరు సూర్య. హీరో మారినా.. పేరు మాత్రం మార్చలేదు. మహేష్ కి సూర్య అనే పేరు పెట్టారు. ఇన్నాళ్లకు మళ్లీ సూర్యతో పని చేసే అవకాశం వచ్చింది. ఈ కాంబోకి సంబంధించి త్వరలో ఓ అధికారిక ప్రకటన రావొచ్చు.
