2020 నుంచి యువహీరో రామ్ కెరీర్లో చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. రెడ్, వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్.. వరుసగా దెబ్బకొట్టాయి. ఇందులో స్కంద, డబుల్ ఇస్మార్ట్ క్రేజీ కాంబినేషన్ సినిమాలు. బోయపాటి, పూరి.. మాస్ డైరెక్టర్లు. అయితే సినిమాలు చాలా నిరాశ పరిచాయి. ఇప్పుడీ మాస్ జపం వదిలి తన కంఫర్ట్ లెవల్ నుంచి బయటికి వచ్చి ఆంధ్రా కింగ్ సినిమా చేశాడు. ఇందులో తనది అభిమాని పాత్ర. 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
నిజానికి 28న ఈ సినిమా రావాలి. ఒక రోజు ముందే విడుదల చేస్తున్నారు.
ఈ వారం రామ్ కి సోలో ఛాన్స్ దొరికింది. కీర్తి సురేష్ రివాల్వర్ రీటా సినిమా వుంది కానీ సినిమా గురించి జనానికి తెలీదు. ఇప్పటివరకూ ఒక్క ప్రమోషన్స్ ఈవెంట్ కూడా లేదు. సినిమాని ప్రమోట్ చేసుకునే ఉద్దేశం కూడా నిర్మాతల్లో ఉన్నట్లు కనిపించడం లేదు.
ఆంధ్రా కింగ్ కి వున్న బజ్ ముందు రివాల్వర్ రీటా తేలిపోయేలా వుంది. ఈ చిత్రానికి సంబధించిన ప్రతి కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆడియో ద్వారా జనాల్లోకి వెళ్ళిన సినిమా ఇది. ట్రైలర్ కూడా అందరి హీరో అభిమానుల కి కనెక్ట్ అయ్యేలా వుంది. ఎలా చూసుకున్నా రామ్ కి ఇది భలే మంచి అవకాశం. ఉపేంద్ర స్టార్ హీరో పాత్రలో నటించారు. ఆయన కూడా ప్రమోషన్లలో బాగానే భాగం పంచుకొంటున్నారు. కన్నడలో ఉపేంద్ర వల్ల ఈ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన సినిమా ఇది. తనకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇవన్నీ ఈ సినిమాకు కలసి రావాలి. మహేష్ బాబు ‘బిజినెస్ మాన్’ ఈ వారమే రీరిలీజ్ అవుతోంది. రీ రిలీజులకు, ముఖ్యంగా స్టార్హీరోల నుంచి వచ్చే రీ రీలీజులకు మంచి ఆదరణ లభిస్తోంది. మరి ‘బిజినెస్మేన్’ ఎలాంటి ప్రభావం చూపిస్తుందో..?!
