ఆయుధాలన్నీ వదిలి పెట్టేస్తామని మాకు ఫిబ్రవరి వరకూ గడువు ఇవ్వాలని మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు లేఖ రాశారు. అన్ని కమిటీలకు సమాచారం పంపి అందర్నీ ఒకే దారికి తీసుకు రావడానికి ఈ సమయం అవసరం అని వారంటున్నారు. ఇలాంటి లేఖలకు ప్రభుత్వాలు స్పందించే కాలం గడిచిపోయింది. ఇప్పుడు మావోయిస్టులకు ఒకే ఆప్షన్ ఉందని ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. వచ్చి లొంగిపోవడం లేకపోతే ఎన్ కౌంటర్ అయిపోవడం. అంతే తప్ప ఇప్పుడు చర్చలు, ఆయుధాలు వదిలేస్తాం.. కాల్పుల విరమణ పాటిస్తాం అంటే.. పట్టించుకోవడానికి కేంద్రం సిద్దంగా లేదు.
మావోయిస్టులు నిస్వార్థపరులు -కానీ వాస్తవాలు గుర్తించలేరా?
మావోయిస్టులు నిస్వార్థ పరులు. వారు నమ్మిన సిద్ధాంతం కోసం కుటుంబాలను వదిలి అడవి బాట పట్టారు. దశాబ్దాల తరబడి అడవులకే పరిమితమయ్యారు. వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ రూపాయి కూడా సంపాదించుకున్నది లేదు. కానీ వారు అలా అడవుల్లోకి వెళ్లడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు. పడుతూనే ఉన్నారు. ఎన్ కౌంటర్ అయిన తర్వాత వారి మృతదేహాలను తీసుకెళ్లడానికి కూడా వారు తంటాలు పడతారు. అందుకే ప్రజలు వారిపై సానుభూతితో ఉంటారు. కానీ మారిన పరిస్థితుల్ని వారు అర్థం చేసుకోకపోతే ప్రజలు మాత్రం ఏం చేయగలరు?
చచ్చిపోయాక హిడ్మాను పొగిడితే ఏం వస్తుంది ?
ఇప్పుడు అందరూ హిడ్మాను పొగుడుతున్నారు. కానీ ఆయన పోలీసుల చేతిలో ఎన్ కౌంటర్ అయ్యే వరకూ .. పరిస్థితి బాగోలేదు.. నువ్ అడవుల కంటే.. బయట ప్రపంచంలో ఉంటే ఇంకా ఎక్కువ ప్రబావం చూపిస్తావు. ప్రజా జీవితంలోకి రా అని ఒక్కరూ ఆయనపై ఒత్తిడి తేలేకపోయారు. పైగా మావోయిస్టులకు నువ్వే భవిష్యత్ అని చెప్పి రెచ్చగొట్టి ఉంటారు. చివరికి ఇప్పుడు హిడ్మా చనిపోయారు. ఇలాంటి వారిని ఇంకా ఎంతో మందిని కోల్పోయారు. లొంగిపోకపోతే మిగిలిన వాళ్లకూ అదే గతి పడుతుంది. తప్పించుకోగలరన్న నమ్మకం ఎవరికైనా ఉంటుందా?
అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా లొంగిపోవడమే మంచిది !
తెలంగాణ డీజీపీ చాలా ఓపెన్ గా ఆఫర్ ఇచ్చారు. మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడానికి అందరికీ తాను సాయం చేస్తానని ప్రకటించారు. కాల్పుల విరమణ పాటించడం.. ఆయుధాలను వదిలి పెట్టడం.. చర్చలకు సిద్ధమని ఆఫర్ ఇచ్చే పరిస్థితుల్లో మావోయిస్టులు లేరు. మొండిపట్టుదలకు పోయినా .. పార్టీ నిలబడుతుందన్న గ్యారంటీ లేదు. అందుకే అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా లొంగిపోవడం ద్వారా.. కనీసం ప్రజా జీవితంలో అయినా నక్సలిజం సిద్దాంతాలకు మద్దతు పొందేందుకు ప్రజల్లో చర్చ పెట్టుకోవచ్చు. అలా చేయకుండా.. ప్రభుత్వాలకు లేనిపోని ఆఫర్లు ఇస్తే.. స్పందించడానికి వారు సిద్ధంగా లేరు. కనిపిస్తే కాల్చివేయడానికి ఎదురు చూస్తున్నారు.
