నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ‘ఆదిత్య 999’. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ‘ఆదిత్య 369’ అభిమానుల ఫేవరెట్ సినిమా. ఒకవేళ ఆ సినిమాకు సీక్వెల్ చేస్తే మోక్షజ్ఞని కూడా వెండి తెరపై చూడొచ్చు. అలా రెండు కోరికలూ ఒకేసారి తీరతాయి. ఈ ప్రాజెక్ట్ పై ఎప్పటి నుంచో కసరత్తులు చేస్తున్నారు. తాజాగా క్రిష్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారని, ఆయన స్క్రిప్టు పనులు మొదలెట్టారని ప్రచారం జరిగింది. బాలయ్య కూడా ఇటీవల ఓ సందర్భంగా ‘ఆదిత్య 999’ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. క్రిష్ కూడా ఆమధ్య ‘ఆదిత్య 999’ కథపై కసరత్తులు మొదలెట్టారు. బాలయ్యకూ క్రిష్కూ మంచి అనుబంధం ఉంది. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో పాటు ఎన్టీఆర్ బయోపిక్ కూడా క్రిష్నే రూపొందించారు. అందుకే.. ఈసారి కూడా బాలయ్య క్రిష్ని గట్టిగా నమ్మారని చెప్పుకొన్నారు.
అయితే.. ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకొన్నారని తెలుస్తోంది. తనకున్న కమిట్మెంట్స్ వల్ల క్రిష్ ఈ సినిమా చేయలేకపోతున్నారని, అందుకే బాలయ్యతో తన ఇబ్బందులు చెప్పి, ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. క్రిష్ కాకపోతే… ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడున్న టాప్ డైరెక్టర్లంతా తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. వాళ్లెప్పుడు ఫ్రీ అవుతారో తెలీదు. మరోవైపు బాలయ్య చేతిలోనూ ఓ సినిమా ఉంది. గోపీచంద్ మలినేని చిత్రాన్ని ఆయన పట్టాలెక్కిస్తున్నారు. అది పూర్తయ్యేలోగా ‘ఆదిత్య 999’కి దర్శకుడు దొరకాలి. స్క్రిప్టు పనులు మొదలవ్వాలి. నిజానికి గోపీచంద్ మలినేని సినిమాతో పాటుగా 999 ప్రాజెక్టునీ ఒకేసారి సెట్స్ పైకి తీసుకెళ్లాలని బాలయ్య భావించారు. అయితే ఇప్పుడు ఈ ప్లానింగ్ వర్కవుట్ అయ్యేట్టు కనిపించడం లేదు.
