హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట, ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీ, కార్పొరేషన్లను GHMC లో విలీనం కానున్నాయి. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్ లకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ మున్సిపాలిటీల విలీనంతో ఔటర్ రింగ్ రోడ్ లోపలు ఉన్నంతా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తుంది. వచ్చే జనవరికి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కాలపరిమితి తీరిపోతుంది. అయితే మొత్తంగా ఒకే కార్పొరేషన్ గా ఉంచి ఎన్నికలు జరుపుతారా.. మళ్లీ మొత్తం ఢిల్లీలాగా నాలుగు కార్పొరేషన్లు చేస్తారా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటి వరకూ అయితే అన్ని మున్సిపాలిటీలను విలీనం చేస్తున్నారు కాబట్టి ఒకే కార్పొరేషన్ ఉంటుందని అనుకోవచ్చు.
హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ ఎప్పుడో సిటీలో కలసిపోయాయి. అయితే కొన్నాళ్లకిందటి వరకూ అవి గ్రామాలుగానే ఉన్నాయి. తర్వాత మునిసిపాలిటీ, కార్పొరేషన్లుగా మార్చారు. కానీ అన్నీ చిన్న చిన్నవి అయ్యాయి. ఇప్పుడు అన్నింటినీ కలిపి ఒకే కార్పొరేషన్ కిందకు తీసుకు వస్తున్నారు. దీని వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి మేలు జరిగే అవకాశం ఉంది.