కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో ఇంకా సద్దుమణగలేదు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రెడీ అయ్యారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించిన పున్నా కైలాష్ నేత అనే లీడర్‌ను అర్జంట్ గా పదవి నుంచి తప్పించి ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డికే లేఖ రాశారు. ఆయనే డీసీసీ అధ్యక్షుడిని నియమించినట్లుగా తేల్చేసి.. తక్షణం తొలగించాలని ఈ లేఖ రాయడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది.
తెలంగాణ ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన విద్యార్థి నేత పున్నా కైలాష్
పున్నా కైలాష్ నేత పద్మశాలి సామాజిక వర్గం నేత. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిగా ఓయూజేఏసీ నేతగా కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పుకుని, కాంగ్రెస్‌లో చేరారు. మునుగోడు టిక్కెట్ కోసం బీసీ కోటాలో ప్రయత్నించారు. కానీ అవకాశం దొరకలేదు. భువనగిరి ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. కానీ చాన్స్ లేదు. చివరికి ఆయనకు నల్లగొండ డీసీసీ పదవి ఇచ్చారు.
గతంలో కోమటిరెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు
మునుగోడు ఉపఎన్నిక సమయంలో కోమిటరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయలేదు. ఆ సమయంలో పున్నా కైలాష్ నేత వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డితో పాటు ఆయన కుటుంబాన్ని కూడా విమర్శించారు. అవి తిట్లు అనుకోవచ్చు. ఇప్పుడు అదే కారణం చూపి కోమటిరెడ్డి ఆ పదవిని తీసేయాలని ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు డీసీసీ పదవి ఇప్పిస్తారని ఈ పదవిపై ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి అనుచరులు కూడా.. సీరియస్ అవుతున్నారు. కోమటిరెడ్డికి ఆ మాత్రం పవర్ లేదా అని నిందిస్తున్నారు. దీంతో కోమటిరెడ్డి ఆ నియామకాన్ని వ్యతిరేకించక తప్పలేదు.
డీసీసీని నియమించేది రేవంత్ కాదుగా !
డీసీసీ అధ్యక్షుల్ని నియమించడానికి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ఎదుట కసరత్తు చేశారు. స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ నేతృత్వంలోనే ఈ కసరత్తు జరిగింది. రేవంత్ ఒక్కడి మాటతోనే నియామకాలు జరగడంలేదు. అయినా కోమటిరెడ్డి రేవంత్ ను టార్గెట్ చేస్తూ లేఖ రాశారు. నిజానికి పార్టీ పరమైన అంశంలో ఆయన విజ్ఞప్తి చేసినా.. హెచ్చరించినా చేయాల్సింది పీసీసీ చీఫ్‌ను. కానీ రేవంత్ ను బాధ్యుడ్ని చేయడం ఆయన వ్యూహమేనని భావిస్తున్నారు.