దేశంలో ఏవైనా కీలకమైన ప్రమాదాలు లేదా ప్రముఖుల మరణాలు సంభవించినప్పుడు, వాటి వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోకముందే వాటికి రాజకీయ రంగు పులమడం ఒక ఆనవాయితీగా మారింది. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన కొద్ది గంటల్లోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి నేతలు దీనిని ఒక కుట్ర గా చెబుతూ రాజకీయం ప్రారంభించారు.
ఆయన మహాయుతి కూటమి నుండి బయటకు రావాలని చూస్తున్నందునే ఇలా జరిగిందంటూ ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపిస్తున్నారు. అజిత్ పవార్ మహాయుతి నుంచి బయటకు రావాలనుకోలేదు. శరద్ పవార్ తో కలిసిపోయి బీజేపీ కూటమిలోనే ఉండిపోవాలని ప్లాన్ చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది.కానీ ఇప్పుడు ప్రమాదం జరిగే సరికి రివర్స్ లో చెబుతున్నారు. దర్యాప్తు సంస్థలు తమ పని ప్రారంభించకముందే ఇది “ప్లాన్డ్ మర్డర్” అనిపించేలా వాతావరణాన్ని సృష్టించడం ప్రజల్లో అయోమయాన్ని నింపే ప్రయత్నం మాత్రం ప్రారంభించారు.
గతంలో కూడా హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ మరణించినప్పుడు లేదా ఇతర కీలక నేతల ప్రమాదాల సమయంలో ఇలాంటి కుట్ర కోణాలను తెరపైకి తెచ్చి ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకున్నారు. అజిత్ పవార్ వంటి సీనియర్ నేత మరణించినప్పుడు ఆ కుటుంబానికి, అనుచరులకు అండగా ఉండాల్సింది పోయి, వారి మరణాన్ని ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి వాడుకోవడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అన్న విమర్శలు వస్తున్నాయి.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇటువంటి సున్నితమైన సమయాల్లో సంయమనం పాటించకుండా, ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూడటం ప్రజాస్వామ్య ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. మరణించిన వ్యక్తికి ఇచ్చే కనీస గౌరవం కూడా లేకుండా ఇలాంటి మేనేజ్డ్ డ్రామా లు ఆడటం సమాజంలో తప్పుడు సంకేతాలను పంపుతుంది. కానీ మన రాజకీయాల్లో ఇదంతా కామన్.
