తెలంగాణలో రియల్ ఎస్టేట్ లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. పెద్దగా ఎవరూ పట్టించుకోని ఆస్తులకు , ఇళ్లకు ‘లక్కీ డ్రా’ స్కీమ్‌లను ప్రవేశపెట్టి అమ్మేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. నల్లగొండజిల్లా నుంచి ఈ ట్రెండ్ ప్రారంభమయింది. ఖాళీ ప్లాట్ల యజమానులు సూర్యాపేట్, మిర్యాలగూడ, చౌటుప్పల్ వంటి ప్రాంతాల్లో రూ.500 నుంచి రూ.10,000 వరకు టికెట్ ధరలతో లక్కీ డ్రాలు ప్రకటిస్తున్నారు.
నల్గొండ జిల్లాలోని సూర్యాపేట్‌లో ఈ ట్రెండ్ ఉదాహరణగా మారింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. సాధారణంగా ఎవరూ కొనడం లేదని ఇలాంటి స్కీమ్‌తో ప్రయత్నిస్తున్నామని రియల్టర్లు చెబుతున్నారు. మిర్యాలగూడలో కూడా 4 ఎకరాల వ్యవసాయ పొలానికి రూ.10,000 టికెట్ లక్కీ డ్రా కూడా ప్రకటించారు. రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్‌లు ఈ ట్రెండ్‌ను వింత ప్రయత్నంగా చూస్తున్నారు. లక్కీ డ్రాల్లో రిస్క్ ఎక్కువ. టికెట్ సేల్స్ లేకపోతే ఓనర్ డ్రా రద్దు చేయవచ్చు. డ్రా నిజాయితీగా తీస్తామన్న గ్యారంటీ కూడా లేదు.
ఈ ట్రెండ్ పై పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. “లక్కీ లాటరీలు చేపట్టి ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ‘₹1000 కట్టు, ఫ్లాట్ పట్టు’ వంటి క్యాచీ స్లోగన్లతో UPI స్కాన్ కోడ్లు సోషల్ మీడియాలో పంపి మోసాలు జరుగుతున్నాయి. ఇది చట్టవిరుద్ధం,” అని హెచ్చరించారు. పోలీసులు కొంతమంది ఆర్గనైజర్లను గుర్తించి వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటివి అత్యధికం మోసమని.. పట్టించుకోవద్దని పోలీసులు సలహా ఇస్తున్నారు.