రాజకీయాల్లోకి యువత రావాలి. మంచి ఆలోచనలు ఉన్న యువత రావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. కింది స్థాయి నుంచే పిల్లల్లో రాజకీయాలు కూడా ఓ కెరీర్ అనే భావన కలిగేలా చేయగలగాలి. అలాంటి భావన కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం బాలల అసెంబ్లీ నిర్వహించారు. అచ్చమైన అసెంబ్లీకి ఏ మాత్రం తీసిపోకుండా .. ప్రజాసమస్యలపై ఎలా పోరాడాలో.. ఎలా చర్చించాలో అద్భుతంగా ఈ పిల్లలు సభను నడిపారు. స్పీకర్ గా కూడా ఓ విద్యార్థినినే ఉన్నారు.
విద్యార్థులు నిజమైన సభ్యుల్లా మారిపోయి, అసాధారణ ప్రదర్శన చేసి అందరినీ ఆకర్షించారు. సోషల్ మీడియా, ఇతర సమకాలీన అంశాలపై ధాటి ప్రసంగాలు చేసి, అధికార పక్షం, ప్రతిపక్ష నాయకుల్లా మారి మాటల తూటాలు పేల్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ఈ మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేశారు. విద్యార్థులు సభా సమావేశానికి ముందస్తు శిక్షణ పొందారు. సభ ప్రారంభమైన వెంటనే వారు ప్రజాప్రతినిధుల్లాగా మారిపోయారు. అసెంబ్లీ నియమాల ప్రకారం చర్చలు జరిపారు.
అధికార పక్షం పక్షంలో ఉన్న విద్యార్థులు ప్రభుత్వ విధానాలను సమర్థించగా, ప్రతిపక్షం వారు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మాటల తూటాలు, వాదనలు నిజమైన అసెంబ్లీని తలపించేలా ఉండటంతో అందరూ మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ సెక్రటేరియట్, విద్యా విభాగం కలిసి నిర్వహించాయి. పాల్గొన్న విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల నుంచి ఎంపిక చేశారు. వారిలో చాలామంది 10వ, ఇంటర్మీడియట్ విద్యార్థులు. కార్యక్రమానికి అసెంబ్లీ మార్శల్లు, అధికారులు సహకరించారు. సభ ముగిసిన తర్వాత విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు.
పిల్లల అసెంబ్లీని సీఎం చంద్రబాబు, స్పీకర్,లోకేష్ నేరుగా హాజరై చూశారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని పిల్లల్ని అభినందించారు. లోకేష్ అందరికీ రాజ్యాంగపుస్తకం ఇచ్చారు.