భారత రాష్ట్ర సమితి పాలసీ ఒకటే సిద్ధాంతం మీద నడుస్తోంది. రేవంత్ ప్రభుత్వం ఏం చేసినా స్కామే అని ప్రచారం చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. అది కూడా ప్రజలు నమ్మలేని విధంగా ఆరోపణలు చేస్తోంది. దానికి తాజా ఉదాహరణ దరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ విషయంలో చేస్తున్న ఆరోపణలు. ఏకంగా ఐదు లక్షల కోట్ల స్కాం అంటున్నారు. తెలంగాణ బడ్జెటే మూడు లక్షల కోట్లు .. అందులో అప్పులు లక్ష కోట్లకుపైగానే ఉంటుంది. ఆదాయం లక్ష కోట్లకు కాస్త ఎక్కువగా ఉంటుంది. మరి ఐదు లక్షల కోట్ల స్కాం ఎలా చేస్తారు?
ఆ భూముల వాల్యూ ఐదు లక్షల కోట్లు – కానీ ఆ భూములు పారిశ్రామికవేత్తలవే !
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన HILTP-2025 పాలసీ ప్రకారం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల , సమీపంలో ఉన్న 9,292 ఎకరాల పాత ఇండస్ట్రియల్ భూములను మల్టీ-యూజ్ జోన్లుగా మారుస్తారు. ఇందులో ప్లాటెడ్ ఏరియా 4,740 ఎకరాలు. ఔటర్ లోపల కాలుష్య కారక పరిశ్రమల్ని బయటకు తరలించాలని ఎప్పుడో విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ పరిశ్రమల స్థలాలను రెసిడెన్షియల్, కమర్షియల్, IT, రిక్రియేషన్ జోన్లుగా మార్చేందుకు అవకాశం కల్పిస్తారు. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ పాలసీ అమలుకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఈ పాలసీ రాష్ట్ర GDP 2-3 శాతం పెరుగుతుందని రూ. 12,000 కోట్లు పైగా డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు ఆదాయంగా వస్తుందని అంచనా వేశారు.
ఈ భూములన్నీ పారిశ్రామిక సంస్థలవే.. లీజుకిచ్చినవే !
హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి పారిశ్రామికీకరణ కారణం. దశాబ్దాలుగా పరిశ్రమల్ని ఆకర్షించేందుకు ప్రభుత్వం శివారు ప్రాంతాల్లో భూములు కేటాయిస్తూ వచ్చింది. అలా.. ఒకప్పుడు హైదరాబాద్ దూరంలో పలు ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో భూములు లీజుకు ఇచ్చారు. అక్కడ వారు పరిశ్రమల్ని పెట్టారు. రాను రాను అవి సిటీల్లోకి వచ్చేశాయి. అక్కడ కాలుష్య కారక పరిశ్రమల్ని నిర్వహించలేరు. చాలా వరకూ ాపేశారు కూడా.ఆ భూముల్ని వెనక్కి తీసుకోలేరు. హక్కులు పారిశ్రామిక సంస్థలకే ఉంటాయి. కానీ వాటిని ఉపయోగించాల్సింది పరిశ్రమలకే. ఇప్పుడు ఆ రూల్ తీసేసి ORR లోపల 9,292 ఎకరాల పాత ఇండస్ట్రియల్ భూములను మల్టీ-యూజ్ జోన్లుగా మార్చేందుకు అనుమతి ఇస్తారు. భూమి యజమానులు సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ ల్యాండ్ వాల్యూ ఆధారంగా 30-50% వరకు వన్-టైమ్ ఫీజు చెల్లించాలన్నది నిబంధన.
ల్యాండ్ ఓనర్లంతా ప్రభుత్వ పెద్దలకు లంచాలిస్తారని బీఆర్ఎస్ ఆరోపణ
ఈ పాలసీలో.. భూములు మల్టీయూజ్ గా మార్చుకునేవారంతా.. ప్రభుత్వానికి కట్టాల్సింది కట్టి మిగతాది మొత్తం రేవంత్ కు కడతారని.. ఇది ఐదు లక్షల కోట్లు ఉంటుందని అంటున్నారు. ఇది సాధ్యమా అన్నది ప్రజలకూ డౌట్ వస్తుంది. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు అలా ల్యాండ్ మల్టీయూజ్ గా మార్పు చేసినందుకు వేల కోట్లు చెల్లించేస్తారా? అన్ని డబ్బులే వారు కట్టదల్చుకుంటే కోకాపేట వేలంలో పాల్గొని ఎకరానికి నూటయాభై కోట్లు పెట్టి తమకు కావాల్సినంత భూమిని కొనుగోలు చేసుకోలేరా?. ఈ ఒక్క విషయంలోనే కాదు.. ప్రభుత్వం ఏం చేసినా స్కామే అని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ప్రజల్లో చులకన అవుతోంది. ఏం చెప్పినా నమ్మలేకుండా రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి రాజకీయంతో ఫలితాలు ఏమి వస్తాయి?