అమరావతిని వరల్డ్ క్లాస్ సిటీగా మార్చే క్రమంలో నిర్మించిన ఎయిర్ పోర్టు, ఇతర ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కోసం మరో ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విధివిధానాలను మంత్రుల సబ్ కమిటీ ఖరారు చేయనుంది.
గతంలోనే ల్యాండ్ పూలింగ్ కోసం గ్రామసభలు నిర్ణయించారు. కానీ మొదటి దశ అమరావతి పనులు పూర్తిగా పట్టాలెక్కక ముందే ఇలా చేయడంతో రైతులు ఆసక్తి చూపించలేదు. ముందుగా మొదటి దశలో రైతులకు న్యాయం చేయాలన్నారు. దీంతో అప్పటికి ప్రభుత్వం వాయిదా వేసింది. ఇప్పుడు సమాంతరంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండటంతో.. రైతులతో చంద్రబాబు సమావేశమయ్యారు. గురువారం జరిగిన సమవేశానికి ల్యాండ్ పూలింగ్ చేయాల్సిన గ్రామాల నుంచి కూడా రైతులు వచ్చారు. వారు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
గతంలో అధికారులు సరిగ్గా హ్యాండిల్ చేయలేదని మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన తర్వాత రైతులు అంగీకరించారని అన్నారు. విధివిధానాలు ఖరారు చేసి.. అమరావతితో పాటు రైతులు కూడా అభివృద్ధి చెందేలా నిర్ణయాలు తీసుకోనున్నారు.