నాగచైతన్య, సమంత…. విడిపోయిన తరవాత చైతూ మరో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. మరి సమంత పెళ్లెప్పుడు అనేదే ప్రశ్న. కొంతకాలంగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత సన్నిహితంగా ఉంటున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకొంటారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. నిన్నామొన్నటి నుంచైతే ఈ వార్తలు మరింత ఊపందుకొన్నాయి. ఈరోజు సమంత పెళ్లని కొందరు, రేపే ముహూర్తం అని మరికొందరు, ఇప్పటికే వీరిద్దరి పెళ్లి అయిపోయిందని కొందరు.. తలోరకంగా ఊహాగానాలు వినిపిస్తున్నారు. సోషల్ మీడియాలో సమంత పెళ్లి వార్తే హాట్ టాపిక్.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే… ఈరోజు ఉదయం కొయంబత్తూరులో వీరిద్దరూ సంప్రదాయబద్ధంగా ఒక్కటయ్యారని టాక్. అయితే ఈ వివాహ విషయం అత్యంత గోప్యంగా ఉంచారు. వీలు చూసుకొని, అధికారంగా ప్రకటించే అవకాశం ఉంది.సమంత ఏ విషయంలో అయినా కుండబద్దలుకొట్టినట్టు ఉంటుంది. తన విడాకుల వార్తలపై రూమర్లు వచ్చినప్పుడు తనే స్పందించింది. సోషల్ మీడియా ద్వారా అసలు విషయం బయటపెట్టింది. ఈసారీ అదే జరిగే అవకాశం ఉంది. తన పెళ్లి వార్త చిలవలు పలవలుగా మారకముందే.. తనే సోషల్ మీడియా ద్వారా ప్రకటించే అవకాశం ఉంది.
ఫ్యామిలీమెన్ సీరీస్ లో పని చేస్తున్నప్పుడు సమంత – రాజ్ ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ తరవాత బంధం బలపడిందని, ఇప్పుడు పెళ్లి చేసుకొన్నారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరూ చాలాసార్లు కలిసికట్టుగా మీడియా కంట పడ్డారు. దాంతో ప్రేమ వార్తలు బలంగా వినిపించాయి. అయితే సమంత ఎప్పుడూ వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఈసారి ఏకంగా పెళ్లయిపోయిందని అంటున్నారు కాబట్టి.. సమంత నోరు విప్పే అవకాశం ఉంది.